
తూప్రాన్/రామాయంపేట, అక్టోబర్ 30 :మత్స్యకారులకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ ప్రాంతంలోని ఏ ఒక్క కులసంఘాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ సర్కారు ఏడేండ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కులసంఘాలను వివిధ పథకాలతో ఆకట్టుకుంటున్నది. ప్రధానంగా రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నది. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు చేపలు పడుతూ చెరువులో పడి చనిపోతే రూ.5లక్షల ప్రమాద బీమాను అందస్తున్నది. అంతే కాకుండా చెరువులో పడిన సమయంలో కాలు విరిగిపోయినా దవాఖాన ఖర్చు ల కోసం రూ.లక్షా 50వేల నగదు ఇస్తున్నది. ప్రస్తుతం, మెదక్ జిల్లావ్యాప్తంగా 1636 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిల్లో చేపలను పెంచి మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మత్స్యశాఖకు 15కోట్ల 33లక్షల చేపపిల్లలను అందించింది. ఇప్పటివరకు 1360 చెరువులు, కుంటల్లో 3కోట్ల 60లక్షల చేపపిల్లలను అధికారులు వదిలారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చిన్నపాటి కుంటలో 35-48 ఎంఎం చేపలను పెద్ద చెరువు లో 80-100 ఎంఎం చేప పిల్లలను వదులుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మత్స్యకారులకు వ్యాపార అవసరాల నిమిత్తం టీవీఎస్ ఎక్సెల్, చేపల రవాణాకు ట్రాలీ ఆటోలు అందజేసింది.
జిల్లా వ్యాప్తంగా చేపపిల్లలను వదులుతాం
మెదక్ జిల్లా వ్యాప్తంగా రేగోడ్, పెద్ద శంకరంపేట, నర్సాపూర్, మెదక్, తూప్రాన్ పరిసర ప్రాంతాల్లోని చిన్నపాటి కుంటలు, పెద్ద చెరువులలో చేపలను వదులుతున్నాం. మ త్స్యశాఖ కమిటీలు కూడా మాకు సహకరిస్తున్నాయి.జిల్లాలో 1636 చెరువులు, కుం ట లు ఉండగా ప్రభుత్వం 15కోట్ల 33లక్షల చేప పిల్లలను ఇచ్చిం ది. అందులో ఇప్పటి వరకు 1360 చెరువులు, కుంటల్లో 3కోట్ల 60లక్షల చేపపిల్లలను వదిలాం. చేపపిల్లలను వదిలే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నది.
సీఎం కేసీఆర్‌తోనే మా కుటుంబాలకు భరోసా
సీఎం కేసీఆర్ దయతోనే మా కుటుంబాలు బతుకుతున్నాయి. దశాబ్దం క్రితం చేపలు పట్టాలంటేనే భయపడే వాళ్లం. ఇప్పుడు అలా ంటి భయాల్లేకుండా చేసిండు సీఎం సార్. మాకు సబ్సిడీపై వలలు, వాహనాలను సమకూర్చిండు,ఇప్పుడు భయం లేకుండా చెరువులోకి దిగి చేపలు పడుతున్నాం. – పాక రాజు, నిజాంపేట
ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం మా అదృష్టం
సీఎం కేసీఆర్ మత్స్యకారుల బతుకుల్లో జీవం పోసిండు. మాకు చేపలు పట్టేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాడు. మేము చెరువులో ప్రమాదవశాత్తు వలలలో చిక్కుకుని చనిపోతే మాకు రూ.5లక్షల ప్రమాద బీమాను కూడా ఇస్తుండు. ఇంత ఇస్తుండగా మేము కేసీఆర్ సార్‌ను మరచిపోతమా.