
మునిపల్లి, అక్టోబర్ 29 : ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సర్కారు పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరు అంతంత మాత్రమే. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనితీరు మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అలాగే, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల పనితీరును విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నారు. గతంలో విద్యార్థులు దొడ్డు బియ్యం, ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనంతో నానా అవస్థలు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నబియ్యంతో భోజనాన్ని ఏర్పాటు చేసింది. వారంలో రెండు రోజులు గుడ్డు, కూరగాయలు వండించి ఇస్తూ విద్యార్థులు మరింత శ్రద్ధతో చదువుకునేందుకు చొరవ చూపింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
సర్కారు బడిలో ఉచితంగా బట్టలు..
విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా విద్యను అందిస్తోంది ప్రభుత్వం. ప్రతి రోజు విద్యార్థులు ఒకే విధమైన యూనిఫాం డ్రస్సులో వచ్చేందుకు వారికి రెండు జతల బట్టలు ఉచితంగా అందిస్తున్నది. దీంతో కార్పొరేటుకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులు కనిపిస్తున్నారు.
ఉచితంగా కంప్యూటర్ కోర్సు…
మండల పరిధిలోని ఖమ్మంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్ కుటుం బ సభ్యులు పాఠశాలకు కంప్యూటర్ను బ హుమతిగా అందించారు. దీంతో పాఠశాలలో గంటసేపు కంప్యూటర్ శిక్షణను ఇస్తున్నారు.
సంగారెడ్డి టూ ఖమ్మంపల్లి..
తమ పిల్లలకు సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య లభిస్తుందన్న నమ్మకంతో గ్రామీణ ప్రాంతల్లో తల్లిండ్రులు స్థానికంగా ఉన్న సర్కారు బడి వైపు అడుగులు వేస్తున్నారు. మండలంలోని ఖమ్మంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతంలో 60-70 మంది చదువుకునేవారు. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థుల సంఖ్య 140కి చేరింది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖమ్రోద్దీన్ ఆయన కుమారులను ఇదే పాఠశాలలో చేర్పించారు. రోజూ సంగారెడ్డి నుంచి ఖమ్మంపల్లికి తనతో పాటు పిల్లలను బస్సులో బడికి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని స్థానికులు ప్రధానోపాధ్యాయుడిని అభినందిస్తున్నారు. అదేవిధంగా ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మరో ఉపాధ్యాయుడు వినయ్ కుమారుడు కూడా ఖమ్మంపల్లి పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నాడు. వీరి స్ఫూర్తితో మిగతా ప్రభు త్వ ఉపాధ్యాయులు, సిబ్బంది తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివిపించాలని పలువురు సూచిస్తున్నారు.
కంప్యూటర్ శిక్షణ బాగుంది..
మాకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ విద్యపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మాకు ఇంతకు ముందు కంప్యూటర్ అంటేనే తెలియదు. ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్‌పై శిక్షణ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టులపై ఎలా శ్రద్ధ తీసుకుంటారో కంప్యూటర్ తరగతులపై సైతం అదే శ్రద్ధ తీసుకుంటున్నారు.
చదువు బాగా చెబుతున్నారు..
ఇంతకు ముందు మేము సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ బడిలో చదివేవాళ్లం. గతంలో కంటే ఇప్పుడు సర్కారు బడిలో ఉపాధ్యాయులు చాలా మంచిగా బోధిస్తున్నారు. ప్రతి రోజూ పాఠశాలకు వస్తున్నాం. ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగితే వెంటనే చెబుతున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మా తమ్ముడు ఇదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.
మాతో కలిసి చదువుకోవడం సంతోషం..
మాకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుల కుమారులు మాతో చదువుకోవడం సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల పిల్లలు కార్పొరేటు బడిలో చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ మాతో కలిసి ప్రభుత్వ బడిలో చదువుకోవడం బాగుంది. దీంతో మా బడిలో మరింత విద్యార్థులు చేరుతున్నారు.
మరింత అభివృద్ధి చేసుకుంటాం…
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై గ్రామస్తులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరిస్తున్నారు. ఖమ్మంపల్లిలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలను చేర్పించాలని ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.