
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, భారీ జరిమానాలు విధించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం అమలులోకి రానున్నది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ అమ్మకాలపై తనిఖీల బృందాలు ఏర్పాటు చేసి నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించనున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 31 : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. 75 మైక్రా న్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వాడకుండా చూడాలని సీడీఎంఏ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ 571 (బీ) జీవో జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులకు భారీ జరిమానా విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషే ధం అమలులోకి రానున్నది. ఇందుకు కోసం మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పాటు 75 మైక్రాన్ల బరువు కంటే తక్కువ మం దం కలిగిన ప్లాస్టిక్ అమ్మకాలు చేయొద్దని మున్సిపల్ అధికారులు వ్యాపారస్తులకు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లతో పాటు క్యారీ బ్యాగులు, డిస్పోజల్ గ్లాసులు, ప్లేట్లు అమ్మకాలు చేయవద్దని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
75 మైక్రాన్ల లోపు కవర్ల నిషేధం..
గతంలో 40 మైక్రాన్ల మందం ఉండే ప్లాస్టిక్ కవర్లను ప్రభుత్వం నిషేధించింది. ఒకసారి ఉపయోగించిన కవర్లను మళ్లీ వాడాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 నుంచి దీనిని 75 మైక్రాన్లకు పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మ్రైకాన్లకు పెంచనున్నది. మరోవైపు ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వాడాకాన్ని వచ్చే 2022 జూలై నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ప్రతి మనిషి సగటున ఏడాదికి 11 కిలోలకు పైగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పింది. 2022 నాటికి ఈ వాడకం 20 కిలోలకు పెరిగే ప్రమాదమున్నదని హెచ్చరించింది.
మున్సిపాలిటీల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 డిసెంబర్ 30న మళ్లీ జీవో 79 అమలు చేశారు. మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు విక్రయించే హోల్‌సేల్ దుకాణాలపై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించి పెద్ద మొ త్తంలో స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా దాడులు లేకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్రస్తుతం కేంద్రం తాజా ఉత్తర్వులు వెలువరించడంతో మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేగాకుండా మన్సిపాలిల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ కమిటీలు సైతం ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలున్నాయి. మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలున్నాయి.
తాజా నిబంధనలు ఇవే..
‘పర్యావరణ పరిరక్షణ చట్టం-1986’లోని ప్లాస్టిక్ వ్యర్థాలపై 2016లో సవరించిన నిబంధనల ఆధారంగా 50 మైక్రాన్ల కంటే తక్కున పరిమాణం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లు ఉన్నవాటిని, వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల మందం వాటినే వినియోగించాలని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.
కఠిన చర్యలు..
గతంలో 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారు. కేంద్ర ప్రభుత్వం 75 మైక్రాన్లకు పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి దీనిని 120 మైక్రాన్లకు పెంచాలని సూచించింది. వచ్చే ఏడాది జూలై నుంచి పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 75 మైక్రాన్ల లోపు మందంగల ప్లాస్టిక్‌ను ఎవరూ అమ్మకూడదు. అమ్మినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.