
టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు దవాఖానల రూపుమార్చుతుండడంతో పాటు మెరుగైన వైద్యానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ప్రత్యేక కృషితో సాధారణ దవాఖానను అప్‌గ్రేడ్ చేసేందుకు వైద్య విధాన పరిషత్‌కు అప్పగించింది. దీంతో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందనున్నాయి. స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. సకల సౌకర్యాలు కల్పించేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. త్వరలో మెరుగైన వైద్యం స్థానికంగానే అందనున్నదని రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్కానింగ్, ఇతర సౌకర్యాలు…
దవాఖానకు కొత్త భవనం నిర్మాణం అయినప్పుడే ప్రత్యేక ఓపీ, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్, లాబ్ తదితర గదులు నిర్మాణం చేశారు. ఆపరేషన్ థియేటర్లో మిషన్లు కూడా వచ్చి సిద్ధంగా ఉన్నాయి. స్కానింగ్, ఎక్స్‌రే ప్లాంట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంటు నిర్మాణం పూర్తికావస్తున్నది. వార్డుల్లో పైపులను సైతం అమర్చారు. బ్లెడ్ బ్యాంకుకు కావాల్సిన పరికరాలు వచ్చాయి. ప్రత్యేక వైద్య నిపుణులకు కావాల్సిన పరికరాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు సైతం షురూ అయ్యాయని అధికారులు తెలిపారు.
అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకం..
ప్రాథమికోన్నత ఆరోగ్య కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ దవాఖానలో ప్రస్తుతం ఐదుగురు వైద్యులు, 30మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దవాఖాన వైద్య విధాన పరిషత్‌కు మారితే వైద్యుల సంఖ్య పెరగడంతో పాటు స్టాఫ్‌నర్సులు, నర్సులు, ఇతర సిబ్బంది సంఖ్య పెరుగుతున్నది. గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, చిల్ట్రన్ స్పెషలిస్టు, మెడికల్ సర్జన్, అనస్తిషియా, డెంటల్, స్కిన్ స్పెషలిస్టు వైద్యుల నియామకం జరుగుతుంది. కనీసం ఇద్దరు స్టాఫ్‌నర్సులు, వార్డు నర్సులు, బాయ్స్ అంతా కలిపి సుమారు వందకుపైగా సిబ్బంది వచ్చే అవకాశమున్నది. సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వైద్య సేవలందుతాయి. ఇంత మంది వైద్య సేవలందించేందుకు సరిపడా భవన సముదాయం కూడా అందుబాటులో ఉంది.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
హుస్నాబాద్ దవాఖానను అప్‌గ్రేడ్ చేస్తూ వైద్య విధాన పరిషత్‌కు బదలాయించి జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుతో పాటు సంబంధిత రాష్ట్రస్థాయి అధికారులకు ధన్యవాదాలు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పలుమార్లు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విన్నవించాం. ప్రభుత్వం స్పందించి జీవో జారీ చేయడం ఆనందంగా ఉంది. హు స్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తా యి.
సౌకర్యాలు మెరుగుపడుతాయి..
దవాఖాన వైద్య విధాన పరిషత్‌కు మారితే సౌకర్యా లు మెరుగుపడుతాయి. గతంలో సాధారణ వ్యాధులకు మాత్రమే చికిత్సలు అందించే వారు. ఇప్పుడు అన్నిరకాల వ్యాధులకు చికిత్సలు అందజేస్తున్నాం. ఇటీవలనే వైద్య విధాన పరిషత్‌కు మార్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో వైద్యులు, ఇతర సిబ్బంది సంఖ్య పెరుగుతున్నది. దవాఖాన స్థాయి పెరగడంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది.
నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి..
హుస్నాబాద్ దవాఖాన వైద్య విధాన పరిషత్‌కు అప్‌గ్రేడ్ అయితే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభు త్వం దవాఖానను అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఆనందంగా ఉంది. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ప్రజలు రుణపడి ఉంటారు.
మంత్రి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు
హుస్నాబాద్ దవాఖానను వైద్య విధాన పరిషత్‌కు అప్‌గ్రేడ్ చేయించడంలో కీలకపాత్ర పోషించిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు. ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలు వస్తే పెద్ద పట్టణాలు, నగరాలకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి సకాలంలో వైద్యం అందించే అవకాశమున్నది.