చేర్యాల, నవంబర్ 9 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని గుట్టపై ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం పారంభమయ్యాయి. మొదటి రోజు మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం 6.30గంటల పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో ఆలయ అర్చకులు, వేదపండితులు, వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థులు పూజలు నిర్వహించారు.మంగళవాద్య పూర్వక గంగా సేకరణ, బిల్వయాత్ర, మృత్సంగ్రహణం, గోపూజ, మహా గణపతి పూజ, స్వస్తి పన్యాహవచం, రక్షాబంధనం, నాంది సమారాధనం, పంచగవ్య ప్రాశనం, గౌరీపూజ, ఆచార్యాది రుత్విగ్రహనం, యాగశాల సంస్కరణ, యాగశాల ప్రవేశం, తోరణ పూజ, షోడశస్తంభ పూజ, అఖం డ దీపస్థాపన, అంకురార్పణ, పంచకలశ స్థ్ధాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్రపాలక ,మాతృకా, చతుషష్టి యోగినీ మండల, స్వతోభద్ర మండలాది ప్రధాన కలశ స్థ్ధాపన పూజలు, ఆరాధనలు, అగ్ని ప్రతిష్ఠ, ప్రతిమ సోదనం, మహా మంగళహారతి, మహామంత్ర పుష్పం, సాయంత్రం 6గంటలకు అవాహిత మంటప దేవతా ఆరాధన, మహాగణపతి హోమం, విగ్రహానికి పంచగవ్యలేపనం, స్వపనం, జలాదివాసం, మహా మంగళహారతి తీర్థ ప్రసాద వితరణ పూజలు నిర్వహించారు.
తమిళనాడులోని మహాబలిపురంలో కృష్ణశిలతో ఎల్లమ్మ విగ్రహాన్ని తయారు చేయించారు. శ్రీశైలం పీఠాధిపతి సూర్యసింహాసనాధీశ్వర చెన్నసిద్ధ్దరామ పండితారాధ్య శివచార్య మహాస్వాముల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో అలూరి బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, టీఆర్ఎస్ నాయకులు తలారీ కిషన్, ధర్మకర్తలు ఉట్కూరి అమర్‌గౌడ్, ముత్యం నర్సింహులు, చింతల పరుశరాములు, బొంగు నాగిరెడ్డి, తూ ముల రమేశ్‌యాదవ్, పోతుగంటి కొమురవెల్లి, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.