గుమ్మడిదల, నవంబర్ 9: ఈ రైతు కూరగాయల పంటలనే నమ్ముకున్నాడు. ఒకప్పుడు కౌలు రైతుగా పంటలను సాగు చేసుకున్న రైతు ఇప్పుడు భూస్వామి అయ్యాడు. కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ శివారులో ఉన్న గ్రీన్ ఎకర్‌లో హనీఫ్ అనే రైతు కూరగాయలను పండిస్తున్నాడు. ఆధునిక పద్ధతులో కూరగాయలను సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మార్కెట్‌కు తగ్గట్టు డిమాండ్ ఉన్న కూరగాయల పంటలను సాగు చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ రైతు సాగు చేస్తున్న కూరగాయల పంటలను రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునీత, అనుబంధశాఖ అధికారులు, రైతులు హనీఫ్ సాగు చేస్తున్న కూరగాయ పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అభినందిస్తున్నారు. రైతులు మాత్రం ఈ పంటలను పరిశీలించి తాము కూడా ఇలాంటి పంటలను సాగు చేస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చు రూ. 2 లక్షలు.. ఆదాయం రూ. 4 లక్షలు
మల్చింగ్, పందిరి, డ్రిప్ పద్ధతిలో కాకర, బీర కాయల పంటలను సాగు చేస్తున్నాడు. కాకర, బీరకు ఎకరా సాగుకు దాదాపు రూ.రెండు లక్షలు అవుతాయి. గతంలో వినియోగించిన పందిరి, మల్చింగ్ షీట్, డ్రిప్ పరికరాలు ఉండడం వల్ల పందిరి సాగుకు రూ.రెండు లక్షలు ఖర్చు అవుతాయి. ఎకరా పంటలో కాకర, బీర 25 టన్నులు దిడుబడి వస్తాయి. ప్రస్తుతం కిలో కాకర, బీర మార్కెట్లో రూ.25 కొనుగోలు చేస్తున్నారు. సాగు, కూలీల ఖర్చు పోను ఎకరాకు సుమారుగా రూ.4 లక్షలు దిగుబడి సాధిస్తున్నాడు. ఎనిమిది ఎకరాల కాకర, 6 ఎకరాల బీరలో 14 ఎకరాల్లో 50 లక్షల ఆదాయం తప్పకుండా వస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నాడు.
బీర, కాకర పంటల సాగులో లాభాలు
గ్రీన్ ఎకర్స్‌లో వరి సాగుకు ప్రతికూల పరిస్థితుల్లో కూరగాయల పంటలపై రైతు హనీఫ్ దృష్టి సారించాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలను వినియోగించుకుని కూరగాయలను సాగు చేశాడు. ఆధునిక పద్ధతులను పాటించాడు. తనకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో 8 ఎకరాలు కాకర, 6 ఎకరాలు బీర పంటను మల్చింగ్, డ్రిప్, పందిరి సాగు ద్వారా పంటలను సాగు చేస్తున్నాడు. ఇప్పుడు కోతకు వచ్చింది. నిత్యం కాకర, బీరను మార్కెట్‌కు తరలిస్తున్నారు.
కూరగాయల పంటలనే నమ్ముకున్న..
కూరగాయ పంటలనే నమ్ముకున్న. ప్రతి కూరగాయ పంటల సాగుకు మల్చింగ్, డ్రిప్, పద్ధతిలో సాగు చేస్తా. ప్రస్తుతం బీర, కాకర పంటలను పందిరి పద్ధతిలో మల్చింగ్, డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నాను. మల్చింగ్ ద్వారా కలుపు ఉండదు. డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకు ఎరువులు అందిస్తా. సేంద్రియ ఎరువుల వైపే మొగ్గు చూపిస్తా. టమాట పంటను మల్చింగ్, స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తాను. పండిన కూరగాయలను నేరుగా మార్కెట్‌కు తరలిస్తాను. మార్కెట్ డిమాండ్‌ను బట్టి కూరగాయలను సాగు చేస్తూ మంచి లాభాలు సాధించవచ్చు. సర్కారు కూరగాయ పంటల సాగుకు మరిన్నీ సబ్సిడీలు అందించి కూరగాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలవేపు దృష్టి పెడుతారు.