
రామాయంపేట/ చేగుంట/ నిజాంపేట/ తూప్రాన్/రామాయంపేట రూరల్ నవంబర్ 7: రెండు రోజులుగా ఓటరు నమోదు ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు తమ ఓటు నమోదు చేసుకోవాలని తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు బూత్‌లెవల్ అధికారులు ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. రామాయంపేట పట్టణంలో 18ఏండ్లలోపు ఉన్న వారు ఫారం-6లో 20మంది ఓటు నమోదు చేయించుకున్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా 39 బూత్‌ల్లో ఓటు హక్కు కోసం 150 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ శేఖర్‌రెడ్డి తెలిపారు. చేగుంట మండల వ్యాప్తంగా కొత్తగా యువత ఓటరు నమోదుతో పాటు వలసలు వచ్చిన వారితో మొత్తం 369 దరఖాస్తులు వచ్చినట్లు బీఎల్వోలు తెలిపారు. నిజాంపేట మండల వ్యాప్తంగా 175 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ జయ రాములు తెలిపారు. తూప్రాన్ మండల వ్యాప్తంగా ఓటరు నమోదుతో పాటు వలసలు వచ్చిన వారు, మృతి చెందిన వారి దరఖాస్తులు మొత్తం 145 వచ్చినట్లు తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి తెలిపారు. నార్సింగి మండలంలోని 36 దరఖాస్తులు వచ్చినట్లు బీఎల్వోలు తెలిపారు. ఈ ఓటరు నమో దు ప్రక్రియ నవంబర్ 27, 28 తేదీల్లో గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటామని రెవెన్యు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఈనెల 30లోగా నేరుగా ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మెదక్ రూరల్‌లో…
మెదక్‌రూరల్ ,నవంబర్ 7 :18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదుకు చేయించుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ శివకృష్ణ అన్నారు. మండల పరిధిలోని మంబోజిపల్లిలో నూతన ఓటరు నమోదుతో పాటు లిస్టులో మార్పులు ,చేర్పులు కోసం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించుటకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ తహసీల్దార్ శివకృష్ణ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఓటరు లిస్టులో పేర్లు గల్లంతైన వారు, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 30లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. అన్లైన్లో చేసుకొనేవారు httpsః// www.nvsp.in , పోర్టల్ ,voter helpline యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రా మాల్లో ఈ నెల 27,28 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివరాలకు బూత్ లెవల్ అధికారిని సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సర్సంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ సత్తయ్య, అంగన్వాడీ టీచర్ , నాయకులు పాల్గొన్నారు.