
కోహీర్, నవంబర్ 7 : వలస కూలీలకు జీవనోపాధి కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నది. రాయలసీమలోని కర్నూల్ జిల్లా పత్తికొండ నుంచి సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలానికి పలువురు కూలీలు వలస వచ్చారు. పత్తి పంట చేతికరావడంతో దానిని ఏరేందుకు మండలంలోని అనేక గ్రామాల్లో కూలీల అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సీమ నుంచి వచ్చిన వారికి స్థానిక రైతులు ఉపాధి చూపిస్తున్నారు. కిలోకు పది నుంచి పన్నెండు రూపాలయల కూలీ చెల్లిస్తుండడంతో తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకుని వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు పనులు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అక్కడ సరైన వర్షాలు కురువకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం వారికి చాలా కష్టంగా మారింది. పనుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు ప్రస్తుతం ఇతర రాష్ర్టాల కూలీలకు పనులు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరిగి, 24గంటల విద్యుత్తు సరఫరా, రైతుబంధులాంటి పథకాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రభుత్వం పంటలకు సరైన మద్దతు ధర ఇస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. దీంతో వేరే రాష్ర్టాల కూలీలు తెలంగాణకు వచ్చి జీవనోపాధి పొందుతున్నారు. కష్టకాలంలో ఇక్కడికి వచ్చిన తమకు పని చూపించడం పట్ల కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు నుంచి వచ్చినం..
పొట్ట కూటి కోసం నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చినం. రైతుల పొలాలకు వెళ్లి పత్తిని తెంపుతున్నం. ఒక నెల రోజులు ఇక్కడ పనులు చేసి గుంటూరుకు వెళ్తాం. మాకు ప్రతిరోజూ పని కల్పిస్తున్నందుకు రైతులకు ధన్యవాదాలు.
జీవనోపాధి దొరికింది..
పత్తిని తెంపడానికి ఇంతదూరం వచ్చినం. ఉండడానికి తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నం. తెంపిన పత్తికి కిలోల చొప్పున కూలి ఇస్తున్నారు. దీంతో మా కుటుంబాలకు జీవనోపాధి దొరికింది. మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. మా కష్టాలను గుర్తించి మాకు పని ఇచ్చినందుకు రైతులకు కృతజ్ఞతలు.
పని కల్పిస్తున్నం..
పని చేసేందుకు కర్నూల్ జిల్లా నుంచి వందమంది వరకు వలస కూలీలు పోతిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చారు. నేను వంద ఎకరాలకు పైగా కౌలుకు తీసుకొని పత్తి, సోయా, తదితర పంటలను పండిస్తున్న. వారు ఇక్కడకు వచ్చి నన్ను పని అడిగారు. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో నేను కూడా వారికి పని ఇస్తున్నాం.