
చేర్యాల, నవంబర్ 7 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో మరో ఆధ్యాత్మిక కేంద్రం రూపుదిద్దుకుంటున్నది. స్వా మి ఆలయం పైభాగంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొమురవెల్లి మల్లన్న సొదరి ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 9,10,11 తేదీల్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు శ్రీశైల వీరశైవ మఠం పీఠాధిపతి కొమురవెల్లికి రానున్నారు. ఎల్లమ్మ దేవాలయం, మండపం తదితర వాటికి రంగులు వేయడంతో పాటు మూడు రోజుల పాటు నిర్వహించే పూజలకు ప్రత్యేకంగా యాగశాల ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు వేశారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ఈవో అలూరి బాలాజీ అమ్మవారి ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దేవాదాయ కమిషనర్ అనిల్‌కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిసి ఆహ్వానాలు అందజేశారు.
కృష్ణశిలతో అమ్మవారి విగ్రహం తయారీ..
మల్లన్న క్షేత్రంలో ఇప్పటి వరకు అమ్మవారికి గుడికి ప్రత్యేక మండపం లేదు. పూర్వకాలం నుంచి అమ్మవారు గుట్ట పైభాగంలోని ఓ గుహలో చిన్న విగ్రహం, అమ్మవారి ప్రతిరూపం ఉం డేది. అమ్మవారి విగ్రహం లేనప్పటికీ మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఎల్లమ్మను దర్శించుకునేవారు. బోనం సమర్పించి, ఒడిబియ్యం పోసి, కల్లు శాక సమర్పించేవారు. ప్రస్తుతం అమ్మవారికి ప్రత్యేక మండపం నిర్మించడంతో పాటు దేవాదాయశాఖ స్తపతి వల్లినాయకం సూచనల మేరకు మల్లన్న ఆలయ అధికారులు తమిళనాడులోని మహాబలిపురంలో కృష్ణశిలతో ఎల్లమ్మ విగ్రహాన్ని తయారు చేయించారు. ఆలయ నిధులు రూ.3.20 లక్షలతో తయారు చేసిన విగ్రహం రెండు నెలల క్రితం కొమురవెల్లికి చేరుకున్నది. మంచి ముహూర్తాలు లేకపోవడంతో ప్రతిష్ఠాపనోత్సవాలు ఆలస్యమయ్యాయి. రోజురోజుకూ భక్తులు పెరుగుతుండడంతో ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక వసతులు కల్పించేందుకు ఆలయవర్గాలు కృషిచేస్తున్నాయి. కొత్తగా మండపం నిర్మించడం, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు, అర్చకులు తీర్మానించారు. అమ్మవారి ఆలయం వద్ద వసతులు పెద్దగా లేకున్నా రూ.లక్షల ఆదాయం వస్తున్నది. రానున్న రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.
మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు
ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.9,10,11 తేదీల్లో 1008 శ్రీశైల సూర్వసింహాసనాధీశ్వర చెన్నసిద్దరామ పండితారాధ్య శివచార్య మహాస్వాముల ఆధ్వర్యంలో యంత్ర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహిస్తారు. జగద్గురు మహాస్వామి వారికి పాదార్చన, జయాది హోమం, మహా పూర్ణాహుతి, కలశద్యాసం, శిఖర కుంభాభిషేకం, కలశ ప్రోక్షణ, శాంతి కల్యాణం, మహా మంగళ హారతి, మహా మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్ధ ప్రసాద వితరణ తదితర పూజలు నిర్వహించనున్నారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.