
కంది, నవంబర్ 7: అక్షయపాత్ర పేరు అంటూ తెలియని వారు ఉండరు. ఈ ఫౌండేషన్ దాతలు, ఇతర ప్రభుత్వ సంస్థల సహకారంతో ఎంతోమందికి ఉచితంగా భోజనాలను అందజేస్తున్నది. పేదవాడి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన అక్షయపాత్ర ఫౌండేషన్ ఎంతో మంది ప్రశంసలు పొందుతున్నది. 2018 మార్చిలో కందిలో మెగా కిచెన్ పేరిట ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సంస్థ రోజు లక్షల మందికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ వస్తున్నది. 3 నుంచి 4 గంటల వ్యవధిలోనే లక్షల భోజనాలను సిద్ధం చేయడం కిచెన్ ప్రత్యేక. కొవిడ్ కారణంగా రెండేండ్లపాటు విద్యాసంస్థలు మూసివేశారు. ప్రస్తుతం పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో మెగా కిచెన్ తెరుకున్నది. ఈ కిచెన్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ప్రభు త్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు కలిపి రోజుకు 1.45 లక్షల భోజనాలను చేరవేస్తున్నది.
పౌష్టికాహారం ఇవ్వడమే లక్ష్యంగా..
పాష్టికాహారం అందించడమే లక్ష్యంగా సుచీ, శుభ్రత పాటిస్తారు. సిబ్బంది రాజీ పడకుండా పౌష్టిహాకారమైన భోజనాలు రోజూ భారీ యంత్రాలతో వండుతారు. పనిచేసే సిబ్బంది కూడా పూర్తి పరిశుభ్రత పాటించి పనిచేస్తారు. మెగా కిచెన్ సంస్థ సభ్యులు పూర్తిగా వ్యాక్సినేట్ చేయడమే కాకుండా పరిశుభ్రత, ప్రామాణాలు కచ్చితంగా పాటిస్తున్నా రు. పనిచేసే సిబ్బంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రోజు డ్యూటీకి వచ్చే వారికి గేటు వద్ద థర్మోచెక్కింగ్ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్వాహకులు రాజీపడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా రోజుకు 1.45 లక్షల భోజనాలు
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కంది మెగా కిచెన్ ద్వారా రోజుకు 1.40 లక్షల నాణ్యమైన పౌష్టికాహార భోజనాలను అందజేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రస్తుతం లెక్కల ప్రకారం రోజుకు 26 వేలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు 55 వేలు, ఇతర విద్యార్థులకు 45వేల వరకు భోజనాలు తమ డెలవరీ వాహనాల ద్వారా ఈ సంస్థ చేరవేస్తున్నది. వీరు రోజూవారీగా అందించే భోజనంలో అన్నం, పప్పు, సాంబారు, ఏదైనా ఒక కరీతో పాటు మజ్జిగను అందజేస్తున్నారు.
కొవిడ్ సమయంలో కూడా వీరి సేవలు..
కొవిడ్ కారణంగా చాలా మంది దేశంలో తిండి తిప్పిలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా కొవిడ్ సమయంలో 19 రాష్ర్టాల్లో ఇప్పటి వరకు 19.1 కోట్ల మందికి ఉచితంగా భోజనాలు అందజేసినట్లు ఆ సంస్థ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే రోజుకు 80వేల మందికి ఉచితంగా భోజనాలు అందజేస్తున్నట్లు చెప్పారు.
పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం
కడుపునిండా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అక్షయపాత్ర ఫౌండేషన్ స్థాపించాం. ఇప్పటికే దేశవ్యాప్తం గా ఎంతో మందికి రోజుకూ కోట్లలో భోజనాలు మా సంస్థ ద్వారా చేరుతున్నాయి. కొవిడ్ సమయంలో కూడా ఎంతో మంది అభాగ్యులకు ఉచితంగా భోజనాన్ని అందజేశాం. రోజుకు 1.45 లక్షల భోజనాలు డెలివరీ వాహనాల ద్వారా చేరవేస్తున్నాం.
కంది మెగా కిచెన్ వివరాలు..
కందిలోని అక్షయపాత్ర మెగా కిచెన్లో మొత్తం 280 మంది సిబ్బంది పని చేస్తుండగా, వీరు రెండు షిప్టుల ద్వారా ఇక్కడ పనిచేస్తున్నారు. భోజనాలను చేరవేసేందుకు 65 డెలివరీ వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనాల్లో 4వేల మందికి సరిపడా భోజనాలను తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వండి భోజనాలను ప్రత్యేక సిబ్బంది ద్వారా వారి నాణ్యతను పరిశీలించిన తర్వాతనే అందరికీ చేరవేయడం ఇక్కడి కిచెన్ ప్రత్యేకత.