కట్టంగూర్, మార్చి 19 : బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కట్టంగూర్ లోని నల్లగొండ, కురుమర్తి క్రాస్ రోడ్డు, నకిరేకల్ లోని నగేశ్ హోటల్ సమీపంలో గల 65వ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, జాతీయ రహదారుల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సర్వీస్ రోడ్లు లేకపోవడంతో వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా సర్వీస్ రోడ్లు, జంక్షన్ల వద్ద ఐమాక్స్ లైట్లు, సెంట్రల్ లైటింగ్, బ్లింకర్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, రంబుల్ స్టిక్స్, సూచిక బోర్డులు, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే జాతీయ, రాష్ట్ర హైవేలపై బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
రాత్రి సమయంలో రహదారిపై వాహనాలను నిలిపి ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని సూచించారు. ఆయన వెంట శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ఎన్ హెచ్ ఎ ఐ రెసిడెంట్ ఇంజినీర్ కిషన్ రావు, జోగేంద్ర చౌదరి, కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ నాగార్జున, రామ్ కుమార్, సంజీవ చౌదరి, డి టి ఆర్ బి రిటైర్డ్ సిఐ అంజయ్య, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ ఉన్నారు.