Pink Slip | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఐదంకెలతో మొదలయ్యే జీతం. వారానికి ఐదు రోజులే పని. అద్దాల భవనాల్లో ఉద్యోగం. అద్భుతమైన భవిష్యత్తు. ఇప్పటివరకు అందరిలో ఉన్న భావన ఇదే. అందుకే, మన దేశంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఐటీ ఉద్యోగమంటే తుమ్మితే ఊడిపడే ముక్కు అనే పరిస్థితులు వచ్చేశాయి. ఎప్పుడు ‘పింక్ స్లిప్’ వస్తుందో అనే ఆందోళన సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కలవరపరుస్తున్నది. కరోనాతో మొదలైన లేఆఫ్‌ల సీజన్ ఇప్పుడు ఏఐ రాకతో పీక్స్‌కు చేరింది. తాజాగా యాపిల్, సిస్కో, ఐబీఎం, ఇన్టెల్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు 27,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి.
భారీగా ఐటీ ఉద్యోగాల కోత
ఐటీ రంగంలో గత రెండుమూడేండ్లుగా కంపెనీలు భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇంటెల్ సంస్థ 10 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే లక్ష్యంతో 15 వేల మంది ఉద్యోగాలు ఊడగొట్టింది. ఏఐపై దృష్టి సారించడానికి యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ, సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలు లేని 6,000 మంది ఉద్యోగులను సిస్కో సంస్థ తప్పించింది. ఐబీఎం సంస్థ చైనాలో ఆర్ ఆండ్ బీ కేంద్రాన్ని మూసేయడంతో వెయ్యి మంది ఉద్యోగాలు పోయాయి. ఇవన్నీ దిగ్గజ సంస్థలు. ఇక, చిన్న చిన్న కంపెనీలు తొలగిస్తున్న ఉద్యోగుల లెక్కే లేదు. ‘ప్రాజెక్ట్ అయిపోయింది.. ఇక పని లేదు’ అనే మాట ఏ రోజున వినాల్సి వస్తుందో అనే భయం ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్నది. మంచి వేతనాలు ఉన్నాయనే ఆలోచనతో లోన్లపై ఇండ్లు, కార్లు కొన్న వారైతే మరింత కలవరపడుతున్నారు.
స్కిల్స్ పెంచుకుంటేనే ఫ్యూచర్
ఐటీ ఉద్యోగులు, ఈ రంగంలోకి వచ్చే విద్యార్థులు తాజా లేఆఫ్‌లను చూసి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ ఐటీ నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోతున్నదని, ఇంకా అవే పాత స్కిల్స్‌తో ఉద్యోగంలో కొనసాగడం దినదిన గండమే అని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, డాటా అనలటిక్స్, బ్లాక్ చెయిన్ వంటి రంగాలు ప్రధాన భూమిక పోషించబోతున్నాయని చెప్తున్నారు. ఐటీ రంగంలో భవిష్యత్తు బాగుండాలని ఆశించే ఉద్యోగులు, విద్యార్థులు వీటికి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు.
నైపుణ్యాలు పొందేందుకు అనేక మార్గాలు
ఐటీ రంగంలోని ఉద్యోగులు, ఈ రంగంలోకి ప్రవేశించనున్న విద్యార్థులు టెక్నాలజీలో వస్తున్న భారీ మార్పులను గుర్తించాలని, భవిష్యత్తులో డిమాండ్ ఉండే నైపుణ్యాలను గుర్తించి శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగ భద్రతను పొందాలని నిపుణులు చెప్తున్నారు. ఇందుకుగానూ ఆన్లైన్లో అనేక ఎడ్యూటెక్ సంస్థలు ఇస్తున్న కోర్సులను పొందవచ్చని లేదా ఇన్స్టిట్యూట్లలో అయినా శిక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. కొన్ని కంపెనీలే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పేందుకు శిక్షణ ఇప్పిస్తున్నాయని, ఈ అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్తున్నారు. హ్యాకథాన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇప్పటికే ఆయా నైపుణ్యాలతో పని చేస్తున్న వారి నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందాలని సూచిస్తున్నారు.