సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోతున్నది. కొన్నేండ్లుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. విద్యపై ఉన్నతాధికారులు శ్రద్ధ తగ్గించి, పదవులు, పదోన్నతులు, బాధ్యతలపై దృష్టిసారిస్తుండటంతో పరిపాలన గాడితప్పుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. గడిచిన ఐదేండ్ల నుంచి ర్యాంకింగ్ గణనీయంగా పడిపోతుండటం యూనివర్సిటీపై మాయని మచ్చగా మారుతున్నది. ఈనేపథ్యంలోనే ఫైనాన్సియల్ ఎకనామిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న మయూక్ మృతి చెందడం కలకలం సృష్టించింది. విద్యార్థి మృతి చెందడానికి కొంతమంది తోటి విద్యార్థులతో పాటు ఓ విద్యార్థి సంఘం నాయకులే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దొంగతనం పేరిట వేధించడంతో పాటు భౌతిక దాడికి పాల్పడటంతోనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లో ఇదంతా జరుగుతున్నా రిజిస్ట్రార్, వీసీ, అడ్మిన్ విభాగం నుంచి కనీస స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయూక్ ఫైనాన్సియల్ ఎకనామిక్స్‌లో ఫస్టియర్ చదువుతున్నాడు. గత కొద్దిరోజుల క్రితం ఓ ల్యాప్‌టాప్ దొంగతనం ఆరోపణలు ఎదుర్కొనగా తానే దొంగిలించానని ఒప్పుకున్నట్లు విద్యార్థులు చెప్తున్నారు. తాజాగా ఇటీవల మరో ల్యాప్‌టాప్ మాయమవడంతో మయూక్ దొంగిలించాడని కొంతమంది విద్యార్థులతో పాటు ఓ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తూ.. మానసిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. మయూక్ ఉండే హాస్టల్ గదిలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడటంతో సెక్యూరిటీ కార్యాలయానికి వెళ్లి కైంప్లెంట్ చేశాడు. అక్కడికీ వెళ్లిన సదరు విద్యార్థి సంఘం నాయుకులు, పలువురు విద్యార్థులు మయూక్తో పాటు సెక్యూరిటీ ఆఫీసర్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. అయినా సంఘటనపై వీసీ, రిజిస్ట్రార్, అడ్మిన్ విభాగం నుంచి ఎలాంటి స్పందన రాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి వేధింపులు, దాడులు జరుగుతున్నా అడ్మిన్ విభాగం పట్టించుకోకపోవడంతో మయూక్ మనస్థాపం చెందాడని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానసిక వేధింపులు, భౌతిక దాడి జరిగినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మయూక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్, అడ్మిన్ విభాగాధిపతులు బాధ్యత వహిస్తూ మయూక్ కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొంత మంది విద్యార్థి నేతలు, కొన్ని సంఘాలకే ఉన్నతాధికారులు అండగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులందరినీ సమానంగా చూడాలంటున్నారు. ఇప్పటికైనా క్యాంపస్‌లో వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కొండాపూర్, మే 21 : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి మయూక్ కుందు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వర్సిటీ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, టీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, ఏఎస్ఏ విద్యార్థి సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. మయూక్ను మాదకద్రవ్యాలకు బానిసగా, ల్యాప్ టాప్ దొంగగా చిత్రీకరించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘాల నేతలు మయూక్ కుందు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మయూక్ ఆత్మహత్యను ఖండిస్తూ ప్రకటనను విడుదల చేశారు. మయూక్ ఎప్పుడూ మాదకద్రవ్యాల ప్రభావంలో కనిపించలేదని, అతను తెలివైన విద్యార్థి అని అతడి ఉపాధ్యాయులే చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు వర్సిటీ యజమాన్యం దృష్టికి పలు డిమాండ్లను తీసుకువెళ్లాయి. మయూక్ ఆత్మహత్యకు దారితీసిన ఘటనపై నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. మయూక్ కుందు కుటుంబానికి న్యాయమైన నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు.