సిటీబ్యూరో: భానుడి భగ భగలతో మహానగరం నిప్పుల కొలిమిలా మండుతోంది. బుధవారం 39.5 డిగ్రీలుగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు గురువారం ఒక్కసారిగా 3.5 డిగ్రీలు పెరిగి, 43 డిగ్రీలకు చేరుకోవడంతో నగర జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. గ్రేటర్లో ఉదయం నుంచి రాత్రి వరకు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 43.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పగటి ఉష్ణోగ్రతల స్థాయికి చేరుకుని 30 డిగ్రీలకు చేరువలో 29.7డిగ్రీలుగా నమోదవడంతో రాత్రి సమయంలో కూడా వాతావరణం వేడితో మండిపోతుంది.
గాలిలో తేమ అత్యల్పంగా 26 శాతానికి పడిపోవడంతో పొడిగాలి ఏర్పడి, ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏప్రిల్ మాసంలో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, మే మొదటి వారంలో 42 డిగ్రీలుగా నమోదైన విషయం తెలిసిందే. అక్కడి నుంచి అడపాదపడా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం జరిగినప్పటికీ గురువారం ఒకేసారి పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకోవడంతో నగర వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో నగరంలో వడగాల్పులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.