న్యూఢిల్లీ, జూన్ 7: మోసపూరిత విధానాలను అవలంబించడం ద్వారానే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికి ఒక బ్లూప్రింట్ లాంటివని ఆయన విమర్శించారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ త్వరలోనే బీహార్ ఎన్నికల్లో, ఆ తర్వాత బీజేపీ ఓడిపోయే అన్ని ప్రాంతాల్లో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ఆంగ్ల పత్రికలో రాసిన ఆర్టికల్‌లో మహారాష్ట్రలో రిగ్గింగ్ ప్రక్రియ జరిగిన ఐదు దశలను వివరించారు. మొదటి దశ: ఎన్నికల కమిషన్ నియామకం కోసం ప్యానెల్‌ను రిగ్ చేయండి. 2వ దశ: ఓటరు లిస్టులో నకిలీ ఓటర్లను చేర్చండి. 3వ దశ: కృత్రిమంగా ఓటర్ల సంఖ్యను పెంచండి. 4వ దశ: కచ్చితంగా బీజేపీ విజయానికి అవసరమైన చోట బోగస్ ఓటింగ్‌ను లక్ష్యంగా చేసుకోండి. 5వ దశ: సాక్ష్యాలన్నీ మాయం చేయండి. ఈ విధానాలను పాటించే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆయన ఆరోపించారు.
పూర్తిగా అర్థ రహితం: ఈసీ
రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమైనవని ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కానీ, ఆ పార్టీ నియమించిన పోలింగ్ ఏజెంట్లు కానీ ఎలాంటి తీవ్ర ఆరోపణలు చేయని విషయాన్ని ఈసీ ప్రస్తావించింది.
నకిలీ కథనాల తయారీకి బ్లూప్రింట్
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నకిలీ కథనాలను తయారు చేయడానికి ఒక బ్లూప్రింట్ అని, వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న విచారం, నిరాశ కారణంగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీహార్‌లో పరాజయం తప్పదని తెలిసే రాహుల్ ఈ అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.