హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ‘హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) రోడ్ల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఎక్సెస్ టెండర్లతో రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో పలు అంశాలు మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యామ్ రోడ్ల పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆధారాలతో బయటపెట్టామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 25% ఎక్సెస్‌తో టెండర్లు వేయబోతున్నారని, పలు కంపెనీలు ఆ టెండర్లను దక్కించుకోబోతున్నాయని చెప్పామని తెలిపారు.
అప్పుడు టెండర్లు ప్రక్రియ ప్రారంభించకముందే ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తమపై అక్కసు చూపారని గుర్తుచేశారు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, 25% ఎక్సెస్‌తో పలు కంపెనీలు దక్కించుకున్నాయని తెలిపారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌శాఖల్లో ఎక్సెస్‌తో టెండర్లను కొంతమందికే కట్టబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆర్అండ్బీ కంటే పంచాయతీరాజ్ శాఖలో ఎక్సెస్ టెండర్లు 2% ఎక్కువగా వచ్చాయని చెప్పారు.
హ్యామ్ టెండర్లలో ఒక్క టెండర్ ఏకంగా 75% ఎక్సెస్ వేశారని హరీశ్‌రావు వెల్లడించారు. యావరేజ్‌గా 22-25% ఎక్సెస్ టెండర్లు నమోదయ్యాయని చెప్పారు. ఆర్‌అండ్‌బీలో రూ.11 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే ఎక్సెస్‌తో కలిపి టెండర్ వాల్యూ రూ.15 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. దీంతో టెండర్ విలువ రూ.4వేల కోట్లు ఎక్కువైందని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో రూ.6వేల కోట్లకు టెండర్లు పిలిస్తే దాదాపు రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లకు టెండర్ ఎక్సెస్ అయ్యిందని వెల్లడించారు. ఎక్సెస్ టెండర్లతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.5 వేల కోట్లకు పైగా అదనపు భారం పడనున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
మన రాష్ట్రంలో జాతీయ రహదారులకు టెండర్లు పిలిస్తే 25% తక్కువకు టెండర్లు పోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ రోడ్లకు పిలిచిన టెండర్లు 25% ఎక్సెస్‌కు పోవడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఈ హ్యామ్ రోడ్లల్లో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా.. 60% బ్యాంకుల నుంచి అప్పు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఈ 60 శాతం బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులకు 30 ఇన్స్టాల్మెంట్లలో వడ్డీతో కలిపి 15 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ మొత్తానికి ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చిన్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ అప్పులభారం వచ్చే 15 ఏండ్లపాటు రాబోయే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రజలపై పడుతుందని మండిపడ్డారు. సావనీర్ గ్యారెంటీ ఇవ్వడంతో నేరుగా ఖజానా నుంచి వాయిదాలు కట్ అవుతాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రత్యక్ష అప్పులతోపాటు పరోక్ష అప్పులు కూడా చేస్తుందని వివరించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హ్యామ్ రోడ్ల టెండర్లలో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం మొబిలేజేషన్ అడ్వాన్స్‌ల విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే.. వ్యతిరేకించింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. ఇది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారని నాడు రేవంత్‌రెడ్డి ఆరోపించారని గుర్తుచేశారు. ప్రాణహిత-చేవెళ్లలో నాడు 0.5% సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్‌కు పొందుపరిస్తే, టెండర్లు అయ్యాక 3.5% పెంచి రూ.2,354 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారని వివరించారు.
ఆనాడు ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ రోజు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. తాజా టెండర్ విలువ రూ.25 వేల కోట్లయితే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్‌కు రూ.2,500 కోట్లు అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి పనిచేయక ముందే మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను కాంట్రాక్టర్లకు ఇవ్వనున్నదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని రద్దుచేసిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ తిరిగి ప్రవేశపెట్టిందని విమర్శించారు.
ఒకే కంపెనీకి 15 టెండర్లు దక్కాయి. త్వరలోనే ఆధారాలతో ఆ వివరాలు బయటపెడుతా. టెండర్లలో పాల్గొన్న అన్ని కంపెనీలు 25 నుంచి 75% ఎక్సెస్ టెండర్లు వేశాయి. ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫైలుపై సంతకం పెడుతారా? పారదర్శకంగా ఉంటారా? అనేది తేలాల్సి ఉన్నది.
-హరీశ్‌రావు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లకు 5% ఎక్సెస్ సీలింగ్ ఉండేదని, అంతకన్నా ఎక్కువ ఉంటే టెండర్లను రీకాల్ చేసేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. మరి ఏ ప్రతిపాదికన కాంగ్రెస్ ప్రభుత్వం 25% ఎక్సెస్ ఇస్తున్నదని ప్రశ్నించారు. ఆర్‌అండ్‌బీలో 34 ప్యాకేజీలు, పంచాయతీరాజ్ శాఖలో 17 ప్యాకేజీలకు చేసి టెండర్లు పిలిచారని తెలిపారు. నాడు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐకి ఫిర్యాదులు చేసి, నేడు ఈ టెండర్లను రేవంత్‌రెడ్డి ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఏమిటి? అని మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రింగ్‌లా ఏర్పడి టెండర్ల వ్యవహారాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలప్పుడే ఈ వ్యవహారాన్ని తాము లేవనెత్తితే.. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
రిటైర్డ్ ఇంజినీర్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ల చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్అండ్బీ శాఖలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావుకు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖలో రిటైర్డ్ ఈఎన్సీ జోగారెడ్డికి ఆరు నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చారని.. టెండర్ల ప్రక్రియ ముగియకపోవడంతో మరో మూడు నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు తెలిపారు. రిటైరయ్యే అధికారుల చేతుల్లో ఇన్ని వేల కోట్ల టెండర్ల ప్రక్రియ పెట్టి పూర్తిచేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అని అనుమానాలు వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులకు ఎక్స్టెన్షన్లు ఇవ్వొద్దని చెప్పారని గుర్తుచేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించిన కార్పొరేషన్ టీజీఈడబ్ల్యూఐడీసీ కింద రూ.15 వేల కోట్ల టెండర్ల ప్రక్రియ సైతం ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న చీఫ్ ఇంజినీర్(సీఈ) శశిధర్‌తో నిర్వహించారని వివరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పెద్ద ఎత్తున దవాఖానల నిర్మాణాలు జరుగుతున్నదని, దీనికి సంబంధించి టీజీఎంఎస్ఐడీసీ సీఈగా సైతం ఇదే శశిధర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్ ఈఎన్సీ రమేశ్‌బాబు సైతం ఎక్స్టెన్షన్పైనే ఉన్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్స్టెన్షన్లు ఇస్తే దుమ్మెత్తిపోసిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్స్టెన్షన్లు ఉండవని చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సలహాదారులు ఉండరని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు 10 మంది అడ్వైజర్లను ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. అడ్వైజర్ల మీద రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు ఈ రోజువరకూ పెండింగ్‌లోనే ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియకు సంబంధించి అమలులో ఉన్న 5% సీలింగ్ దాటకుండా చూడాలని కోరారు. ఎక్సెస్ టెండర్లను, మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని రద్దుచేసి, టెండర్లను రీకాల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఆర్‌అండ్‌బీలో రూ.11వేల కోట్లకు టెండర్లు పిలిస్తే ఎక్సెస్‌తో కలిపితే టెండర్ విలువ రూ.15 వేల కోట్లు అయ్యింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.6 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే దాదాపు 7 నుంచి రూ.8వేల కోట్లకు టెండర్ ఎక్సెస్ అయ్యింది. రెండూ కలిపి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా సొమ్మును కొల్లగొట్టే కుటిలయత్నం జరుగుతున్నది. అంతమొత్తంలో ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నది.
-హరీశ్‌రావు