లాహోర్, మే 7: పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ అంగీకరించాడు. పాక్‌లోని బహావల్పూర్లోగల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా భారత్ జరిపిన దాడిలో తన కుటుంబ సభ్యులతోపాటు సన్నిహిత సహచరులు మరో నలుగురు కూడా మరణించారని తెలిపాడు. బహావల్పూర్లోని జామియా మస్జిద్ సుభాన్ అల్లాహ్‌పై జరిగిన దాడిలో తన అక్క, ఆమె భర్త, వారి కుమారుడు, కోడలు, మరో కుమార్తె, ఐదుగురు పిల్లలు మరణించారని మసూద్ అజర్ ఒక ప్రకటనలో వెల్లడించాడు. ఈ దాడిలో తన అత్యంత సన్నిహిత సహచరుడు అతని తల్లి, మరో ఇద్దరు సహచరులు కూడా హతమయ్యారని పేర్కొన్నాడు. ‘ఈ క్రూరమైన చర్య అన్ని హద్దులను ఉల్లంఘించింది. ఇకపై దయ చూపించకూడదు’ అని ఆ ప్రకటనలో వ్యాఖ్యానించాడు.
బహావల్పూర్పై జరిగిన దాడిలో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని పాక్ మిలిటరీ ప్రకటించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ-814 విమానాన్ని 1999లో కాందహార్‌కు హైజాక్ చేసిన ఉగ్రవాదులు ప్రయాణికులను విడిచిపెట్టేందుకు బదులుగా భారత జైలులో మసూద్ అజర్‌ను విడిచిపెట్టాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. అప్పుడు జైలు నుంచి విడుదలై పాకిస్థాన్‌కు పారిపోయిన మసూద్ అజర్ బహావల్పూర్ను స్థావరంగా చేసుకొని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఐక్యరాజ్యసమితి 2019, మే నెలలో మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఏప్రిల్ తరువాత ఇంతవరకు బహిరంగంగా ఎక్కడా కనిపించని అజర్ బహావల్పూర్లోని ‘సురక్షిత ప్రాంతం’లో తలదాచుకుంటున్నట్టు సమాచారం.
హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ హతం?
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత వైమానిక దళం పాక్‌లోని ముజఫరాబాద్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాకు చెందిన శిక్షణా శిబిరంపై మిస్సైల్ దాడి జరిపింది. ఈ దాడిలో లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా హతమైనట్టు భావిస్తున్నారు. లష్కరేకు చెందిన ఈ శిక్షణా కేంద్రానికి తల్హా సయీద్ పర్యవేక్షకునిగా ఉన్నట్టు సమాచారం. భారత్ జరిపిన దాడిలో తల్హా సయీద్‌తోపాటు లష్కరేకు చెందిన ఐదుగురు టాప్ కమాండర్లు కూడా మరణించారని పాక్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి వెనుక మాస్టర్‌మైండ్‌గా పేర్కొంటున్న అబ్దుల్ రెహమాన్ కూడా ఈ దాడిలో మరణించినట్టు అనుమానిస్తున్నారు. క్షిపణి దాడిలో లష్కరే శిక్షణా కేంద్రం నేలమట్టమైందని ఓ సైన్యాధికారి తెలిపారు. ‘ఇది ప్రతీకాత్మక దాడి కాదు, నిర్ణయాత్మక సందేశం’ అని ఆ సైన్యాధికారి వ్యాఖ్యానించారు. అయితే తల్హా సయీద్ మృతిపై అధికారిక సమాచారం వెలువడలేదు. 2023లో హఫీజ్ సయీద్ నిర్బంధం తరువాత లష్కరే కార్యకలాపాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో తల్హా సయీద్ కీలకంగా మారాడు. ఒకవేళ అతడు ఈ దాడిలో మృతి చెంది ఉంటే లష్కరే అది తీరని నష్టాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.