హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మృతి, ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఈ నెల 10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది మావోయిస్టులు మరణించిన మే 21ను విప్లవ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. హైదరాబాద్‌లో మార్చిలో హైకోర్టు మాజీన్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో శాంతిచర్చల కమిటీ ఏర్పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాలని సూచించిందని గుర్తు చేసింది.
శాంతి చర్చలకు సిద్ధమేనని తమ పార్టీ కూడా మార్చి 28న పత్రికా ప్రకటన ద్వారా అభిప్రాయం తెలిపిందని పేర్కొంది. ఆ తర్వాత రెండుసార్లు మావోయిస్టు పార్టీ మీడియా కమిటీ ప్రతినిధులు శాంతి చర్చలకు సానుకూల పరిస్థితిని కల్పించాలని కోరినట్టు తెలిపింది. ఆ ప్రకటనలను ఏమాత్రం లెక చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తూ.. ఏప్రిల్ నుంచి దాదాపు 85 మందిని హత్య చేసిందని ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేసింది. నిరుడు జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు దాదాపు 540 మంది మావోయిస్టులను, ‘జల్ జంగల్ జమీన్’ కోసం పోరాడుతున్న సాధారణ ప్రజలను హత్య చేశారని మండిపడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిని కోల్పోవడం పార్టీకి భారీ నష్టమేనని, ఈ నష్టం శాశ్వతం కాదని తెలిపింది.
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు నక్సలైట్ల అరెస్ట్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ముగ్గురు నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ముగ్గురిపై రూ.21 లక్షల రివార్డు ఉన్నట్టు శనివారం తెలిపారు. అరెస్టయిన వారిని దోడి పోడియా (36), దోడి పండు (18), దోడి నందు (28) లుగా గుర్తించారు. జగర్గుండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారి స్వగ్రామం గొండ్పల్లిలో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో వీరిని అరెస్ట్ చేశారు. వీరిపై స్థానిక శిక్షదూత్ (తాత్కాలిక టీచర్) హత్యతో పాటు పలు నేరాల అభియోగాలు ఉన్నాయి. వీరిలో పోడియా మావోయిస్టుల ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడు కాగా, పాండు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యుడు. వీరిద్దరిపై తలా రూ. 8 లక్షలు, నందూపై 5 లక్షల రివార్డు ఉంది.