కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 24: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాపారావు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట అనుచరులతో మంగళవారం లొంగిపోయాడు. మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం కేంద్రం ఈ నెల 31ని డెడ్‌లైన్‌గా నిర్ణయించిన నేపథ్యంలో ఆ గడువుకు ముందే ఆ పార్టీ కీలక నేతలు ఇప్పటికే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ కీలక నేత పాపారావు తన అనుచరులతో కలిసి ఏకే-47లు, సెల్ఫ్ లోడెడ్ రైఫిళ్లతో సహా లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. పాపారావు భార్య ఊర్మిళ 2025 నవంబర్‌లో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పాపారావుపై సుమా రు రూ.50 లక్షల రివార్డు ఉన్నది. ప్రస్తుతానికి పాపారావు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.