Chinthana | ఈ విశాల విశ్వం దేవుడి సృష్టి. ఆ దేవుడి చేతిలోనే మనిషి జీవన్మరణాలు ఉన్నాయి. ఆయురారోగ్యాలైనా, సౌభాగ్య దౌర్భాగ్యాలైనా అన్నీ దైవం హస్తగతమై ఉన్నాయి. ఒక్కడైన దేవుడిని ఆరాధించడానికే మనిషి పుట్టాడు. దేవుడి ప్రవక్తలంతా ఇదే బోధించారు. ఈ భావన మనుషుల మధ్య విభేదాలను, వైషమ్యాలను తొలగిస్తుంది. మనుషులందరినీ ఒక్కటి చేస్తుంది. దైవానికి దాస్యం చేయాలన్న సృహ వల్ల సేవకుడు యజమాని, పాలకుడు పాలితుడు, కూలివాడు యజమాని, నల్లవాడు తెల్లవాడు, అధికుడు అల్పుడు అంతా కలిసి ఒకే పంక్తిన దైవారాధనలో నిలబడతారు.
మానవాళి అంతా ఒకే ప్రాణి ద్వారా ఉనికిలోకి వచ్చిందని ఖురాన్ అనేక పర్యాయాలు నొక్కి చెప్పింది. ‘మానవులారా, మీ ప్రభువునకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించాడు. అదే ప్రాణి నుంచి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంటద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపచేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ దేవునికి భయపడండి’ (దివ్య ఖురాన్ 4:1). ఈ విధంగా ఇస్లామ్ మనుషులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లనీ, మనమంతా సోదర సమానులనీ చెబుతుంది. అందుకే మనమంతా బంధువుల్లా మెలుగుదాం.
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076