హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): యువత తరుఫున గళమెత్తుతున్న కేటీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ గ్లోబరీనా ముసుగులో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాల్లేకుండా గ్లోబరీనాను కేటీఆర్‌కు అంటగట్టడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా యువత ఉద్యమించిన తీరును మనమందరం చూస్తున్నామని, ఢిల్లీతో పాటు అన్ని నగరాల్లో రోడ్లపైకి వచ్చి నీట్ లీకేజీకి బాధ్యుడైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసి సాధించుకున్నారని అన్నారు. ప్రశ్నించే యువలోకానికి పాలకులు సమాధానం చెప్పకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయని కేటీఆర్ ఏనాడో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన చెప్పిన మాటలను మంత్రులు, కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేశారని, నేడు ఏం జరుగుతున్నదో దేశం మొత్తం చూస్తున్నదని, కేటీఆర్ చెప్పిందే నిజమైందని వ్యాఖ్యానించారు. యువత సమస్యకు పరిష్కారం చూపాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలకు తెరలేపిందని దుయ్యబట్టారు.
యువత కోసం కేటీఆర్ ర్యాలీ తీస్తే, సీఎం రేవంత్ మాత్రం యువతను విస్మరించి రాహుల్ మెప్పుకోసమే కొడంగల్‌లో ర్యాలీ తీశారని క్రిశాంక్ విమర్శించారు. నీట్ పరీక్ష లీకేజీ గురించి మాట్లాడలేదని, కేంద్రంలోని ప్రధాని మోదీపై పల్లెత్తుమాట అనలేదని విరుచుకుపడ్డారు. యువత కోసం గళమెత్తిన కేటీఆర్‌ను కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విద్యారంగంలో సంస్కరణల కోసం కేటీఆర్ మాట్లాడుతుంటే ఓర్వలేని కొందరు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి మంచి మిత్రులని దెప్పిపొడిచారు. కష్టకాలంలో పరస్పరం సహకరించుకుంటారని, కలిసికట్టుగా కేసీఆర్, కేటీఆర్‌పై నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని ఆరోపించారు. వారి మిత్రత్వానికి బండి కొడుకుపై పోక్సో కేసే నిదర్శనమన్నారు. గ్లోబరీనా కేటీఆర్ సంస్థ అయితే 2013లో జేఎన్టీయూ సదరు సంస్థకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిం ది? నాడు వీఎస్ఎన్ రాజు గ్లోబరీనా సీఈవోగా ఉన్నది నిజంకాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబరీనాకు అనేక అవకాశాలు ఇవ్వలేదా? 2013లో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఇండియా సమ్మిట్‌కు గ్లోబరీనా స్పాన్సర్‌గా వ్యవహరించలేదా? ఇప్పుడు కాళోజీ యూనివర్సిటీ వెబ్సైట్ నడిపిస్తున్నది పేరు మార్చుకున్న గ్లోబరీనా కాదా? అని ప్రశ్నలవర్షం కురిపించారు. గ్లోబరీనా కేటీఆర్‌దని చెప్తున్న సీఎం దమ్ముంటే సిట్ వేసి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.