నేటి యువతరం కెరీర్, ఎంజాయ్మెంట్ అంటూ పరుగులు పెడుతుంటే ఈ 27 ఏండ్ల యువకుడు మాత్రం సమాజం కోసం, అనాథల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. కడుపున పుట్టినవాళ్లు కాదనుకున్న అభాగ్యులకు దేవుడిచ్చిన కొడుకు అనిపించుకుంటున్నాడు. 11 ఏండ్లుగా అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ, ఎవరూ లేనివారికి ఆఖరి మజిలీలో తోడుగా నిలుస్తున్నాడు దనాల ఆర్యవంశీ. ‘మనకోసం మనం బతకడం జీవితం కాదు.. నలుగురి కోసం బతకడమే నిజమైన జీవితం’ అంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ యువకుడు బతుకమ్మతో ముచ్చటించాడు.
ఆ విశేషాలు తన మాటల్లోనే…
మాది సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్పల్లి. ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న. చిన్నప్పటినుంచే సామాజిక సేవపై ఆసక్తి ఎక్కువ. ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ల మేనకోడలు తలసేమియాతో బాధపడుతుండేది. ఆమెకు రక్తం ఎక్కించడం కోసం చాలామందిని అడిగాం. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పాప చనిపోయింది. ఆమె మరణం నన్ను ఎంతగానో కలిచివేసింది. అలాంటి పరిస్థితి మరెవరికీ ఎదురవ్వకూడదని 2015లో రక్తదాతల గ్రూప్ క్రియేట్ చేశాను.
అత్యవసర సమయాల్లో స్పందించి రక్తదానం చేసే వారి వివరాలు కనుక్కొని మరీ అందులో యాడ్ చేశాను. రక్తం కావాలని ఎవరు అడిగినా వెంటనే స్పందించి, సంబంధిత డోనర్‌ను పంపించేవాణ్ని. ఈ సేవను తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడులోనూ కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు 5000 మందికి పైగా బాధితులకు బ్లడ్ డొనేట్ చేశాం. వ్యక్తిగతంగా రక్తదానం చేసే అదృష్టం మాత్రం నాకు దక్కలేదు. నేను ఎప్పుడు రక్తదానం చేయడానికి వెళ్లినా.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉందని, బలహీనంగా ఉన్నానని వైద్యులు చెప్పేవారు. దాంతో నిరాశతో వెనుదిరిగేవాణ్ని.
400కు పైగా అంత్యక్రియలు చేశా
ఒకసారి నాకు తెలిసిన వ్యక్తి మరణించాడు. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా మాట్లాడే ఆయన రోడ్డుపక్కన దిక్కులేని శవంగా పడి ఉన్నాడు. ఆయనకంటూ ఎవరూ లేరు. అందుకే, ఆ పెద్దాయనకు అంతిమ సంస్కారం నేనే నిర్వహించాను. ఆ తర్వాత కార్ఖానా దగ్గర ఓ వృద్ధురాలు మరణించింది. ఆమెకు కూడా తలకొరివి నేనే పెట్టాను. అప్పుడు నా వయసు 17 ఏండ్లు. వాళ్లిద్దరి అంత్యక్రియలు చేసినప్పుడు భయం కన్నా.. ఎక్కువగా బాధేసింది. కడుపున పుట్టిన వాళ్లు కాదనుకున్న ఎందరో అభాగ్యులు ఈ మహా నగరంలో అనాథలుగా కాలం చేస్తున్నారు. వారికి గౌరవంగా సాగనంపడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావించాను. అందుకే వివిధ పోలీస్ స్టేషన్లలో నా ఫోన్ నెంబర్ ఇచ్చి, అనాథ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు చేస్తానని చెప్పాను.
అలా హైదరాబాద్ పరిధిలో 400కు పైగా అంత్యక్రియలు నిర్వహించాను. మృతుల ధర్మానుసారం ఈ చివరి గౌరవం సమర్పిస్తున్నాను. నా సేవా కార్యక్రమాలు తెలుసుకున్న ఓ పెద్దాయన ఫోన్ చేసి..‘నాకు సొంత ఇల్లు, కావాల్సినంత ఆస్తి ఉంది. అయినా నా పిల్లలు పట్టించుకోవడం లేదు. వృద్ధాశ్రమంలో ఉన్నాను. ఎవరో తెలియని వారికి అంత్యక్రియలు చేస్తున్నావు. నా అంత్యక్రియలు కూడా నువ్వే చేయాలి బాబు’ అంటూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన మాటలు నేను ఎన్నటికీ మరిచిపోలేను.
పవిత్రంగా భావిస్తా
పేరు కోసం చేస్తున్న సేవ కాదిది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఇటీవల ఓ ఫ్రెండ్ ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్లాను. ఇల్లంతా తిరుగుతూ మాట్లాడుకున్నాం. వాడితోపాటు వాడి బంధువులకూ నేను చేసే సేవ గురించి తెలుసు. అక్కడినుంచి నేను తిరిగి రాగానే ‘వాడొక కాటికాపరి. శవాలను దహనం చేస్తాడు, వాడి దగ్గర దెయ్యాలు ఉంటాయి. వాడు మన ఇంటికొస్తే మన ఇంట్లోకీ వస్తాయ’ని ఆ బంధువులు వాడిని తిట్టారట. నాకు నవ్వొచ్చింది. కనీస మానవత్వం లేని ఆ మనుషుల మీద జాలి కలిగింది. ఎవరు ఏమనుకున్నా నా పనిని నేను పవిత్రంగానే భావించాను. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మాత్రం కావాల్సినంత ఉంది. మా నాన్నకు ఎక్కడైన అనాథ శవం కనిపించినా, తెలిసిన వారికి రక్తం అవసరమైనా నాకు ఫోన్ చేసి మరి చెబుతారు.
నా జీతం డబ్బుతోనే
ఈ సేవా కార్యక్రమాల కోసం ఎవరి సహాయం తీసుకోను. జెప్టో, స్విగ్గీ డెలివరి బాయ్, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డెలివరీ బాయ్‌గా పనిచేస్తాను. ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి పదకొండు గంటలవరకు క్యాబ్ డ్రైవర్ అవతారమెత్తుతాను. నెలకు సుమారుగా రూ.60 వేల వరకు సంపాదిస్తాను. ఆ డబ్బుతోనే అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాను. ఒక్కో శవానికి రూ.12,000 వరకు ఖర్చు అవుతుంది.
చేతిలో డబ్బులు లేనప్పుడు అప్పులు చేసి కార్యక్రమాలు చేస్తాను. నా భార్య కూడా పనిచేస్తుంది. తన జీతం కుటుంబ పోషణకు, నాది సమాజ సేవకు ఉపయోగిస్తున్నాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనాథ శవాలు కనిపించినా, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైనా 63003 72886 నంబర్‌కు కాల్ చేయండి. వీధిన పడిన వృద్ధులకు కొడుకుగా మారాలన్నది నా ఆలోచన. భవిష్యత్తులో వృద్ధుల కోసం అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను.
…? రాజు పిల్లనగోయిన