హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కేపీసీ ప్రాజెక్ట్స్‌తో కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయంటూ.. నాడు ఓట్ల కోసం అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్ ఎలా కట్టబెట్టారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సూటిగా ప్రశ్నించారు. ‘నాడు వద్దన్న కంపెనీ నేడు ముద్దు ఎందుకైంది.. నాటి మీ ఆరోపణలు తప్పా? లేక నేడు మీరిచ్చిన కాంట్రాక్ట్ తప్పా?’ ఏది నిజం అని నిలదీశారు. ఆరోపణలు తప్పయితే ముక్కు నేలకురాసి ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2023కు ముందు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లతో కేసీఆర్, కేటీఆర్‌కు సంబంధాలు అంటగట్టి నిరాధార ఆరోపణలు చేసేవారని గుర్తుచేశారు. అప్పుడు ఈస్ట్ ఇండియాతో పోల్చిన ఓ కంపెనీతో ఇప్పుడు అంటకాగుతున్నారని ఆరోపించారు. వేల కోట్ల కాంట్రాక్ట్‌లు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని నిప్పులుచెరిగారు. ఇదే తరహాలో కేపీసీపై ఆరోపణలు గుప్పించిన ఆయన ఇప్పుడు తన సోదరుడు తిరుపతిరెడ్డిని పురమాయించి ఒప్పందాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు.
అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి నిర్మాణాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌నే తాజా మాజీ ఎమ్మెల్సీ చదివారని క్రిశాంక్ దుయ్యబట్టారు. సదరు విగ్రహాలను నిర్మించిన కేసీపీకి, కేపీసీకి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టులెందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. అవినితీ కంపెనీగా ముద్రపడిన కేపీసీ నిర్వాహకుడు అనిల్కుమార్శెట్టితో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఎందుకు సన్నిహితంగా ఉన్నారు? అని నిలదీశారు.
ఈ సఖ్యతతోనే రూ.400 కోట్ల కాంట్రాక్ట్ కేపీసీకి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో ఫీనిక్స్‌తో కేటీఆర్‌కు సంబంధాలు అంటగట్టారని, కానీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అదే కంపెనీతో అంటకాగుతున్నారని, అప్పటి పాత స్క్రిప్ట్‌ను తాజా మాజీ ఎమ్మెల్సీ తిరగదోడుతున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ అసంబద్ధ, అనుచిత ఆరోపణలకు సీఎం రేవంత్, ఆయనకు వకాల్తా పుచ్చుకుంటున్న మహిళానేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ముక్కునేలకు రాసి తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరాలని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌తో సంబంధాలు అంటగట్టి నిరాధార ఆరోపణలు చేసిన కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అంటకాగుతున్నారని క్రిశాంక్ నిలదీశారు. ఎన్ని కమీషన్లు ముట్టాయని ప్రశ్నించారు. ముఖాలు మారాయి తప్పితే విమర్శలు పాతవేనని, కొందరు రేవంత్‌కు వకాల్తా పుచ్చుకొని తప్పుడు కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. నిజంగా ఆయనకు దమ్మూ ధైర్యముంటే నాడు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేశానని, నాటి సర్కార్ అర్హత ఉన్న కంపెనీలకే కాంట్రాక్ట్‌లు ఇచ్చిందని ఒప్పుకోవాలని తేల్చిచెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను బద్నాం చేస్తున్న నేతలకు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
‘కేసీ పుల్లయ్య కాంట్రాక్టర్, ఈయనది కడపజిల్లా.. కేటీఆర్‌తో వారి కొడుకు అనిల్‌కుమార్ చేరగానే ఆ కంపెనీ పేరు కేపీసీ ప్రాజెక్ట్‌గా మారింది.. దాని ఆర్వోసీ కోడ్ విజయవాడ, రిజిస్టర్డ్ అడ్రస్ 3/308 వైఎమ్మార్ కాలనీ, పొద్దుటూరు, కడప.. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్‌తో చేరగానే కేపీపీ ప్రాజెక్ట్ లిమిటెడ్ అయింది.. రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ, నమోదు చేసుకున్న చిరునామా పొద్దుటూరు, కడపజిల్లా.. అతని పేరు అనిల్‌కుమార్ కామిశెట్టి.. ఇతనిలో ఉన్న గొప్పతనమేంటంటే ఇతను ఆర్కిటెక్టో.. ఇంజినీరో.. లేదంటే అద్భుత కళాఖండాలు సృష్టించే మంచి ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్, ఆయన ఫ్రెండ్ శ్రీధర్ తేలుకుంట్ల అనే వ్యక్తి ఉన్నడు.. ఆయన కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.. ఈ శ్రీధర్‌కు కావాల్సిన వ్యక్తే అనిల్‌కుమార్ కామిశెట్టి.. ఆ శెట్టి.. ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నరు..’ – పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మాటలు
నాడు కేపీసీ కంపెనీపై అడ్డగోలు ఆరోపణలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.400 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టాడు.. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా (కేటీపీఎస్ సెవన్త్ స్టేజ్ (1×800) పనులకు 01-09-2025న టెండర్లు పిలిచారు. వారం క్రితం కేపీసీకి అప్పగించారు.