యాచారం, నవంబర్ 25 : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో మంగళవారం మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో మండలంలో అత్యధికంగా సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, ఉపసర్పంచ్‌లను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజాపాలనలా కాకుండా రాక్షస పాలనను తలపిస్తున్నదని మండిపడ్డారు. ప్ర భుత్వం పంచాయతీ ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా రేవంత్ హయాంలో భూకుంభకోణం నడుస్తున్నదన్నారు. ప్రజల భూములను ప్రైవేట్‌కు అర్పించేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని మండిపడ్డారు. సీఎం అన్నదమ్ములు రియల్ బ్రోకర్లుగా అవతరించి ప్రజల భూములన్నీ అడ్డికి పావుశేరులెక్కన లాగేసుకుంటున్నారన్నారు. ఫార్మాసిటీ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులకు తమ ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం లో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే ఎమ్మెల్యే మల్రెడ్డి ఎంతో ఆర్భాటంగా శిలాఫలకాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని.. సెగ్మెంట్ అభివృద్ధికి రూపాయీ తేలేదని మండిపడ్డారు. ఆయనకు కమీష న్లు, పర్సంటేజీలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదన్నారు.
కేటీఆర్ నియోజకవర్గానికి ఫాక్స్‌కాన్ కంపెనీని తీసుకొస్తే కాంగ్రెస్ నిర్లక్ష్యంతో 2వ యూనిట్ బెంగళూరుకు తరలిపోయిందన్నారు. మల్రెడ్డి హయాంలో విధులు నిర్వహించేందుకు అధికారులు భయపడుతున్నారని.. ఆయన వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే ముగ్గురు ఏసీపీలు, 11 మంది సీఐలు, కొంతమంది ఎంపీడీవోలు బదిలిపై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ సర్కారేనని జోస్యం చెప్పారు. ఈ నెల 26, 27, 28 తేదీ ల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి సమావేశాలను జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, నాయకులు రాజూనాయక్, పీఏసీఎస్ డైరెక్టర్లు స్వరూప, శశికళ, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు.