మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతి పత్రాలు సమర్పించారు. వేమనపల్లి మండలం చామనపల్లిలో రైతులను అటవీశాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నట్లు రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఎప్పటి నుంచి పట్టాలు కలిగి ఉండి 45 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటూ పోలీస్ అధికారులను ఆదేశించారు. హాజీపూర్ మండలం పోచంపాడులో ఐటీ హబ్ కోసం సేకరించిన మా భూముల పరిహారం వేరే వారికి ఇచ్చారంటూ దళిత రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఆ భూములను మాకు తిరిగి ఇప్పించి కుటీర పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రోత్సహించాలంటూ విజ్ఞప్తి చేశారు. భీమారం మండలం వెల్లంపల్లిలో కరెంట్ లైన్ కోసమని తన భూమిలో 80 చింతచెట్లను విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ నరికి వేశారంటూ బాధిత రైతు అధికారులపై ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో సోమవారం రైతులు చేసిన ముఖ్యమైన ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి.
– మంచిర్యాల, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
హజీపూర్ మండలం పోచంపాడు శివారులో సర్వే నంబర్ 46/1 లోని 10 ఎకరాల వ్యవసాయ భూమిని ఆక్రమించుకొని, ఐటీ హాబ్ కోసం మాకు రావాల్సిన పరిహారాన్ని కొందరు వ్యక్తులు స్వాహా చేశారంటూ బాధిత దళిత రైతులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఐటీ హాబ్ ఏర్పాటు చేసేందుకు పోచంపాడులోని దళితుల భూముల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం సైతం చెల్లించింది.
కాగా దళిత రైతుల పేరుపై ఉన్న భూమిని కొందరు బడా లీడర్లు తమ అనుచరుల పేర్ల పైకి మార్చి.. రైతులకు రావాల్సిన పరిహారాన్ని వారి ఖాతాల్లోకి మళ్లించారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం విచారణ చేసి మా 10 ఎకరాలు మాకు ఇప్పించాలని, ఆ భూముల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ను కోరారు. గత వారమే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.
ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం..
‘వేమనపల్లి మండలం చామనపల్లిలో సర్వే నంబర్ 65, 67లోని భూమిని స్థానిక రైతులు 45 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. 1957లోనే అప్పటి ప్రభుత్వం సర్వే చేసి ఈ రైతులకు పైసల్ పట్టా జారీ చేసింది. మొన్నటికి మొన్న కేసీఆర్ ప్రభుత్వం పోడు పట్టాలు కూడా ఇచ్చింది. ఇలా ఎన్నో ఏండ్లుగా ఆ భూములనే నమ్ముకొని సాగు చేసుకుంటున్న 9 మంది రైతులను అటవీశాఖ అధికారులు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.
ఇప్పటికే ఈ భూముల్లో బోర్లు, స్తంభాలు, విద్యుత్ మోటార్లు సైతం పెట్టుకున్నాం. ఇలా ఏండ్లుగా సాగు చేసుకుంటున్న మా భూముల్లోకి అటవీశాఖ అధికారులు వచ్చి ఇవి అటవీ భూములని, సాగు చేయొద్దని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దాడులు చేసి 9 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు సైతం పంపించారు. కలెక్టర్‌కు, ఆర్డీవోకు, తహసీల్దార్‌కు, అటవీశాఖ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. మీరైనా న్యాయం చేయాలి. ఫారెస్ట్ అధికారులు మా భూముల్లోకి రాకుండా నియంత్రించాలి’ అంటూ సోమవారం బాధిత రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు.
1957 నుంచి ఉన్న పట్టాలు, గత ప్రభుత్వం ఇచ్చిన పాసుపుస్తకాలను చూపించి మొరపెట్టుకున్నారు. అన్ని పరిశీలించిన కలెక్టర్ ఫారెస్ట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు బుక్కులు ఉన్న భూముల్లోకి వచ్చి దౌర్జన్యం ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. రైతులను వేధిస్తున్న అటవీ శాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండంటూ పోలీసులను ఆదేశించారు. ‘మీరేం బాధపడకండి నేను చూసుకుంటా’ అంటూ భరోసా కల్పించారు. ‘రెవెన్యూ భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు ఎలా వస్తారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెడితేనే వారు దారికి వస్తారు’ అంటూ కలెక్టర్ మాట్లాడారు. డీఎస్పీతో మాట్లాడి బాధిత రైతుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
కరెంట్ పోల్స్ కోసం 80 చింత చెట్లు నరికేశారు
భీమారం మండలం వెల్లంపల్లి గ్రామం (కాజీపల్లే శివారు)లో ముడపెల్లి మహేశ్‌కు 4.12 ఎకరాల భూమి ఉంది. దీనికి కంచె వేసుకొని మామిడితోటతో పాటు చింత తోటను సాగు చేస్తున్న సదరు రైతుపై విద్యుత్‌శాఖ అధికారులు దౌర్జన్యానికి దిగారు. కొత్త విద్యుత్ లైన్ పేరుతో పోల్స్ వేసేందుకు తోటలోని చింత చెట్లను నరికివేశారు. రైతు మహేశ్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 10 ఏళ్లుగా పెంచుతున్న 80 చింతచెట్లను నేలకూల్చారంటూ రైతు బోరున విలపించాడు.
ఎందుకు నరికారని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయాడు. గతేడాది కాతకు వచ్చిన చెట్లను అన్నింటిని విద్యుత్‌శాఖ ఏఈ, ఏడీతో పాటు కాంట్రాక్టర్ నరికివేశారని.. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించాడు. 100 సంవత్సరాలు లైఫ్ ఉన్న చెట్లను దౌర్జన్యంగా నరికివేసి లక్షల రూపాయలు నష్టం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు.
హార్టికల్చర్ అధికారులతో సర్వే చేయించి తనకు జరిగిన నష్టాన్ని అంచనా వేయించి పరిహారం చెల్లించాలని కోరాడు. గత వారమే ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధిత రైతు వాపోయాడు. ఈ సారి అధికారులు న్యాయం చేస్తారనే ధీమా వ్యక్తం చేశారు. లేదంటే విద్యుత్‌శాఖ అధికారులు, సదరు కాంట్రాక్టర్‌పై కోర్టుకు వెళ్తానని రైతు మహేశ్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.