హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’పై రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షగట్టింది. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించకపోగా, పెండింగ్ బిల్లులనూ విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నది. మొత్తం రూ. 515.73 కోట్లు చెల్లించాల్సి ఉండగా రెండేండ్లుగా ప్రభుత్వం స్పందించడం లేదు. వీటిలో చిన్న కాంట్రాక్టర్ల బిల్లులే రూ.305.08 కోట్లు ఉండగా, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించిన వాటికి సంబంధించి బిల్లులు రూ.210.64 కోట్లున్నాయి. 2023 మార్చి 8న వనపర్తిలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడుతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేసి, రూ.3,492 కోట్లతో పనులు సైతం చేపట్టారు.
బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 400మందికి పైగా కాంట్రాక్టర్లు సమగ్రశిక్షా ప్రాజెక్ట్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించి రెండు సార్లు విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. అయినా ఫలితం లేకపోవడంతో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ వద్ద ధర్నా చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశాడు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ అక్టోబర్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాసి నెలలు గడుస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
స్కూల్లో టాయిలెట్లు, తాగునీటి వసతి, విద్యుత్తు సౌకర్యం లేదు. ప్రభుత్వం మీద నమ్మకంతో పనులు చేసిన. మావి చిన్న జీవితాలు. స్కూల్ బాగుపడతది. పిల్లలకు మంచి చదువులు అందుతయని పని తీసుకున్న. అప్పులు తెచ్చి రూ.15 లక్షలు స్కూల్ కోసం ఖర్చు పెట్టిన. ఫ్యాన్లు, కిటికీలు, గేట్లు పెట్టిన. రెండేండ్ల క్రితం కొంత ఇచ్చారు. ఈ రెండేండ్ల కాలంలో నయాపైసా రాలే.
కార్పొరేట్ స్థాయి విద్యనందించే ఉద్దేశంతో డైనింగ్‌హాల్స్, రీడింగ్ రూమ్స్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లను సర్కార్ బడుల్లో నిర్మించాం. మా ఊరి భూములు, ఇండ్లు తాకట్టుపెట్టి రూ.18లక్షల ఖర్చుచేసిన. అప్పుల బాధ తట్టుకోలేక ఊర్లో ఉండే పరిస్థితి లేదు. పనులు పూర్తయ్యి రెండేండ్లు అయినా నయాపైసా ఇయ్యలేదు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించినా సర్కార్ పట్టించుకుంట లేదు. బిల్లులియ్యక ఇవ్వకపోతే కాంట్రాక్టర్లమంతా రోడ్డెక్కుతం.
నేను గరీబోన్ని. ఎస్ఎంసీ చైర్మన్‌గా పనిచేసిన. రూ.16లక్షలు తెచ్చి డైనింగ్ హాల్ కట్టిన. 13 రూముల్లో ఎలక్ట్రికల్ పనులు చేసిన. మొత్తం రూ.23 లక్షల పనులు చేస్తే ఇంకా రూ.9లక్షల బిల్లులు రావాలె. బయట 4-5 రూపాయల వడ్డీలకు అప్పులు తెచ్చి. బిల్లులు రాక ఆగమైతున్న. ఆ బాధ పడలేక స్కూల్ గేట్‌కు తాళం వేసిన. నన్ను భయపెట్టిండ్రు. వేధించిండ్రు. అనారోగ్యం బారినపడి అవస్థలు పడుతున్న. మాలాంటోళ్లను ఇబ్బందులు పెట్టుడు మంచిది కాదు. – కోటిదాసు, ఆకునూరు, చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా
స్కూల్ కోసమంటే.. పిల్లలు చదువుకుంటరని మూడు నెలల్లో బిల్డింగ్ కట్టిన. బిల్లులు ఇవ్వకపోవడంతో తాళం వేసిన. ఇంతవరకు తాళం తీయమన్నోళ్లు లేరు. పనులు చేయించుకున్న తర్వాత మా డబ్బులెందుకియ్యరు? సీఎం నియోజకవర్గం మాత్రం మొత్తం బిల్లులు ఇచ్చిండ్రు. యాలాల మండలంలో ఇవ్వలేదు. తెచ్చిన అప్పులకు నెలకు రూ.25వేలు మిత్తి కడుతున్నా. అప్పలు, వడ్డీలు పెరిగిపోతున్నాయి.