హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఒకే ఉద్యోగికి మూడు కీలక బాధ్యతలు అప్పగించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు అయిన బోర్డులోని ఓ అధికారికి ఏకంగా డిపార్ట్మెంట్కు చెందిన మూడు కీలక బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తున్నది. కాలుష్య నియంత్రణ మండలి విధుల్లో భాగంగా ల్యాబ్ నిర్వహణ బాధ్యతలతో పాటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిధులతో కార్యక్రమాలు చేపట్టే ఎన్క్యాప్కు నోడల్ అధికారిగా నియామకమైన అతడికే తాజాగా నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్‌గా కూడా పనులు అప్పగించారు. పీసీబీలో సీనియర్ అధికారికి డైరెక్టర్‌గా బాధ్యతలు ఇవ్వాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా ఆయననే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీనియర్లు మండిపడుతున్నారు.
పదిమంది సీనియర్లను పక్కపెట్టి ‘సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు’కు ఎన్జీసీ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడం, కాలుష్య నియంత్రణ మండలి, సర్వీస్ రూల్స్‌ను తుంగలో తొక్కి నియామకం చేయడంపై పీసీబీ సీనియర్ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఇప్పటికే జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, సీనియర్ సోషల్ సైంటిస్ట్ సహా మరో బాధ్యత అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కీలక బాధ్యతలకు అతనొక్కడే సమర్థుడా.., మండలిలో పనిచేసే సీనియర్లకు అర్హతలు లేవా? ఒక్కడికే ఎందుకంత ప్రాధాన్యం? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, పర్యావరణ మంత్రి మాజీ ఓఎస్డీ సాన్నిహిత్యంతోనే పదవులు పొందాడని ఆరోపిస్తున్నారు.
2001లో కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించిన ఆయన ప్రమోషన్లు, కీలక బాధ్యతలు తప్ప 25 ఏండ్లుగా బదిలీ అనే ముచ్చటే ఎరుగకుండా పాతుకుపోయినట్టు సమాచారం. వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లోకి తీసుకుని, సీనియర్, జూనియర్ అనే సంబంధం లేకుండా, సైంటిఫిక్, ఇంజినీరింగ్‌తో సంబంధం లేకుండా అంతా తాను చెప్పినట్టే ఉండాలనే ఆజమాయిషీ చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికార పెత్తనాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగ కాలం మొత్తం ఒకేచోట గడపాలనే తాజాగా ఎన్జీసీ డైరెక్టర్ బాధ్యతలు ‘కొని’తెచ్చుకున్నారని పీసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి పేషీ, పర్యావరణ మంత్రి పేషీ అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలు కొనసాగిస్తూ అన్నీ అనుకూలంగా చక్కబెట్టుకుంటున్నారని చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వం చించేందుకు సిద్ధమైంది. రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని, పార్టీ గుర్తుపై పోటీ చేసే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పెంచిన రిజర్వేషన్లు అమలు చేస్తామని నమ్మబలికి ఇప్పుడు చేతులెత్తేసింది. సర్కార్ తీరుపై బీసీ సంఘాల నేతలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను గతంలో మాదిరిగానే పరిమితం చేయడంపై బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సర్కార్ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నయవంచనకు పాల్పడిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన అనంతరమే పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని, మంత్రి పదవుల్లోనూ, నామినెటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కోటా హామీని తుంగలో తొక్కుతున్నదని, దీనిని ఎంత మాత్రం సహించబోమని బీసీ, కుల, విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.