Paper Leak | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయడంతోపాటు థర్డ్ ఇయర్ బీఎస్సీ(అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది ఇన్‌సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దుచేసి వారిని తిరిగి వ్యవసాయశాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు.
వివిధ రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజీల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకు అవుతున్నట్టు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ చేపట్టింది. ఏఈఓలుగా పనిచేస్తూ వ్యవసాయ వర్సిటీలో ఇన్‌సర్వీస్ కోటాలో థర్డ్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నపత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసి వాట్సాప్ గ్రూప్‌లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు పంపుతున్నారని, ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని తేల్చారు.