న్యూఢిల్లీ: తనతో మాట్లాడకుండా దూరంగా ఉంటుందన్న కోపంతో మహిళా సహోద్యోగి, ఆమె పెరెంట్స్పై ఒక వ్యక్తి దాడి చేశాడు. కత్తితో వారిని పొడిచాడు. (Man Stabs Woman Colleague) తీవ్రంగా గాయపడిన ఆ ముగ్గురూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రాజౌరి గార్డెన్ ప్రాంతంలోని ఓ సెలూన్లో 21 ఏళ్ల అభిషేక్, ఒక మహిళ పని చేస్తున్నారు. అయితే స్నేహితురాలైన ఆమె ఇటీవల అతడితో మాట్లాడకపోవడంతోపాటు దూరంగా ఉంటున్నది.
కాగా, ఆ మహిళ తీరు పట్ల అభిషేక్ ఆగ్రహం చెందాడు. శనివారం ఉదయం 9 గంటలకు ఖ్యాలా ప్రాంతంలోని ఆమె ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో ఆ మహిళపై దాడి చేసి పొడిచాడు. కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆమె తల్లిదండ్రులపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కత్తి పోటు వల్ల గాయపడిన మహిళ, ఆమె తల్లిదండ్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.