విచక్షణ కోల్పోయినప్పుడు మనుషులు చిన్న చిన్న గొడవలకే హింసకు పాల్పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అలాంటి ఒక సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కేవలం తన మేకను చంపేశారనే కోపంతో ఒక వ్యక్తి తన బలగంతో వెళ్లి రెండు హత్యలు చేశాడు. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది.
వివాలలోకి వెళితే.. మార్చి 2007 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ జిల్లా పరిధి భికారిపూర్ గ్రామంలో అక్లు చౌహాన్ అనే వ్యక్తికి చెందిన మేక రామ్ సనేహి అనే రైతు పొలంలోని పంటను నాశనం చేసింది. తన పంటను నాశనం చేసిన మేకను రామ్ సనేహి కొట్టడంతో ఆ మేక చనిపోయింది. ఈ విషయం తెలిసిన అక్లు చౌహాన్ తన మేకను చంపినందుకు రామ్ సనేహితో గొడవపడ్డాడు.
గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తరువాత అక్లు చౌహాన్ వెళ్లి తన మిత్రులైన జైచంద్, రామ్ సారన్లను వెంట తీసుకువచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి రామ్ సనేహిని కత్తులతో పొడిచి చంపేశారు. రామ్ సనేహిని కాపాడడానికి వచ్చిన పబ్బర్ అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు.
ఈ కేసు 12 ఏళ్ల నుంచి విచారణలో ఉంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఏడుగురు.. కోర్టులో సాక్ష్యం చెప్పడంతో జిల్లా సెషన్స్ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది.