మానోపాడు: మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు ( Lightning ) మరో వ్యక్తి మృతి చెందాడు. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal district) జిల్లా మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు (45), రోజు మాదిరిగానే గేదెలను మేపటానికి పంట పొలాల వైపు వెళ్లాడు.
గురువారం కురిసిన అకాల వర్షానికి పిడుగు పడటంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. పంట పొలాల వైపు ఉన్న రైతులు గమనించి హుటాహుటినా అతడిని ఏపీలో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బోయ చిన్న వెంకటేశ్వర్లు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు.
కాగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని అమ్రాబాద్ ఉమ్మడి మండలంలోని పదర కోడోనిపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపడింది. కండ్లగుంట గ్రామ సమీపంలో వేరుశనగ పంట పొలాల్లో కూలి పనులు చేస్తుండగా పిడుగుపడి సుంకరి సైదమ్మ, వీరమ్మ అనే కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా సుంకరి లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.