కోల్‌కతా, ఫిబ్రవరి 12: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నదా? పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందా? అంటే ఇటీవలి పరిణామాలను బట్టి అవుననే తెలుస్తున్నది. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పోస్టు ఉండాలని కొంత కాలంగా అభిషేక్ వర్గీయులు సామాజిక మాధ్యమాలు వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీనిని పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో మమత శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉన్న జాతీయ కమిటీని రద్దు చేశారు. 20 మంది సభ్యులతో కొత్త కమిటీని నియమించారు. కమిటీలో సీనియర్లకు, నమ్మకస్థులకే పెద్ద పీట వేశారు. పార్టీ తన నియంత్రణలోనే ఉన్నదని ప్రకటించుకోవడంలో భాగంగానే మమత కమిటీని నియమించారని, సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమిటీలో అభిషేక్ బెనర్జీని నియమించినప్పటికీ, పార్టీ జాతీయ కార్యదర్శి పోస్టు నుంచి ఆయనను మమత తప్పించారు. తద్వారా ఆయనకు, ఆయన వర్గీయులకు ముకుతాడు వేశారని భావిస్తున్నారు. బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచినప్పటి నుంచి అభిషేక్ పాపులారిటీ బాగా పెరిగింది. దీనిపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. మమతనే తమ సుప్రీం లీడర్ అని స్పష్టం చేస్తున్నారు. కాగా, కొత్త జాతీయ కమిటీలో సీనియర్ నేతలు డెరెక్ ఒబ్రెయిన్, సౌగతారాయ్లకు చోటు దక్కకపోవడం గమనార్హం.
బెంగాల్ మంత్రి ఆరోపణలు పచ్చి అబద్ధం
న్యూఢిల్లీ: తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్ దుర్వినియోగం చేసిందని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ స్పందించింది. తాము టీఎంసీ, ఆ పార్టీ నేతలకు చెందిన ఏ డిజిటల్, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించటం లేదని స్పష్టం చేసింది.
బెంగాల్ గవర్నర్‌పై చర్యలు తీసుకోండి రాజ్యసభలో టీఎంసీ ఎంపీ తీర్మానం
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొంటూ, రాష్ట్ర యంత్రాంగంపై బహిరంగంగా విమర్శిస్తున్న గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్‌రాయ్ రాజ్యసభలో శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొంతకాలంగా ట్వీట్లు, ప్రకటనలు, మీడియా ముందు, ఇతర సోషల్ మీడియాల్లో ప్రభుత్వంపై గవర్నర్ ధన్కర్ విమర్శలు గుప్పిస్తున్నారని సుఖేందు ఆరోపించారు. ఆర్టికల్ 156 ప్రకారం.. గవర్నర్ నియామకాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించారు.