కోల్‌కతా : కాషాయ పార్టీ కనుమరుగు కావాలని తాను కోరుకుంటున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు విపక్షాలు సమిష్టిగా ముందుకెళతాయని, తమకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండాలు లేవని, మోదీ సర్కార్‌ను నిలువరించేందుకు అందరం చేతులు కలుపుతామని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకం చేసే దిశలో భాగంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో సమావేశమయ్యారు.
మీడియా సమావేశంలో దీదీ మాట్లాడుతూ విపక్షాలు కలిసిమెలసి ఉన్నాయనే సంకేతాన్ని పంపుతున్నామని, బీజేపీని మట్టికరిపించాలన్నదే తన లక్ష్యమని, ఈ దిశగా విపక్షాల ఐక్యతకు తాము పనిచేస్తామని, ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఇక దేశాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని నితీష్ కుమార్ మండిపడ్డారు. విపక్షాలతో చర్చలు జరుపుతున్నామని, పార్లమెంట్ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
తామేం చేసినా దేశానికి మేలు చేసే విధంగా ముందుకెళతామని నితీష్ కుమార్ పేర్కొన్నారు. మోదీ సర్కార్ ప్రజల కోసం పనిచేయడం లేదని, కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని మండిపడ్డారు. దేశాభివృద్ధికి కాషాయ పాలకులు చేస్తోంది శూన్యమని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విపక్షాల కార్యాచరణతో కూడిన బ్లూప్రింట్‌ను రూపొందించడంపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. మమతా బెనర్జీతో చర్చలు ఫలవంతమయ్యాయని, విపక్ష పార్టీలు సమావేశమై ఎన్నికల వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు విపక్ష కూటమి ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా మమతా బెనర్జీ, నితీష్, తేజస్వి యాదవ్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
Read More
BRS Party | ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం