న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడే వాళ్లు.. నామినేషన్ వేసేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకే డెడ్లైన్. అయితే చివరి రోజు ఆ పార్టీ మరో ట్విస్ట్ ఇచ్చింది. రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే కూడా కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17వ తేదీన జరగనున్న ఆ పోరులో ఇప్పటికే దిగ్విజయ్, శశిథరూర్ పోటీపడనున్న విషయం స్పష్టమైంది. ఈ ఇద్దరు కూడా ఇవాళే నామినేషన్ వేయనున్నారు. ఖర్గే పోటీపడే అంశాన్ని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ పోటీ విషయంలో గాంధీ కుటుంబం జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఖర్గే అధ్యక్ష పదవికి ఎన్నికైతే ఆయన రాజ్యసభకు రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తికి ఒకే పోస్టు నియమాన్ని పాటించనున్నారు. అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ లాంటి నేతలు కూడా కాంగ్రెస్ అధ్యక్ష పోరుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.