మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం విరాళాన్ని అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రూ.50 లక్షలు, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన మొత్తంతోపాటు ప్రజాప్రతినిధులు రూ.80 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మొత్తంగా రూ.1.3 కోట్ల విరాళాలను గురువారం (ఈ నెల 28న) యాదాద్రి దివ్యక్షేతంలో ఆలయ ఈవోకు అందజేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని క్యాంప్ కార్యాలయం నుంచి 200 వాహనాల్లో కాన్వాయ్‌గా యాదాద్రికి వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం విరాళం ఇస్తామని పేర్కొన్నారు. స్వర్ణతాపడం కోసం విరాళాలు అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. విరాళాలు అందించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెప్పారు.