మాదిగలలో చిచ్చు పెట్టేందుకు, బానిసలుగా మార్చేందుకు మందకృష్ణకు చందాలు
మతతత్వ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని కులాలు ఉద్యమిస్తాయి
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
కవాడిగూడ, డిసెంబర్ 25 : మనువాద కుట్రలను అమలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డిల భరతం పడుతామని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, కార్యదర్శి జంగ శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు మాదిగలలో చిచ్చు పెట్టేందుకు మందకృష్ణ మాదిగకు కోట్ల రూపాయలు చందాలు అందజేస్తూ దళితులను రాజ్యాధికారం వైపు చూడనీయకుండా బానిసలుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్‌షాకు దొంగచాటుగా లెటర్ ఇచ్చారని మండి పడ్డారు. ఇవన్నీ దళతులు గమనిస్తున్నారని మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మతాల సంఘాలు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అవసరమయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ వైఖరిని మార్చుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బెంచ్ కొట్టివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల ఐక్య వేదిక అధ్యక్షుడు బోర బాలకిషన్, సర్వయ్య, రాజు, బాలకృష్ణ, కిషన్, లక్ష్మణ్, రాజువస్తాద్, రాంచందర్, ప్రదీప్, సత్యనారాయణ, శివకుమార్, మణిదీప్, నవీన్, బుజంగరావు, మోహన్ తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.