6 గేట్లెత్తి దిగువ జూరాలకు నీటిని విడుదల
మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శనివారం ఉదయం రిజర్వాయర్ 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ జూరాల ప్రాజెక్టు లోకి విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఇంజినీర్ ఏఈ నాగశివ తెలిపారు.
ఎగువ నుంచి దాదాపు 7 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే నీటిని దిగువ జూరాల ప్రాజెక్టులోకి వదిలినట్లు ఆయన తెలిపారు. రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 3.13 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు ఉందన్నారు.
అలుగు పారిన కర్ని చెరువు
ఇదిలాఉండగా మండలంలోని కర్ని పెద్దచెరువుకు భారీగా వరద నీరు రావడంతో మల్లీ అలుగు పారింది. దీంతో కర్ని గ్రామం వద్ద రోడ్డు డ్యామ్‌పై అలుగు నీరు ప్రవహించడంతో రాకపోకలు స్థంభించాయి. అనుగొండ, చిట్యాల, పంచలింగాల, పస్పుల, ముస్లాయపల్లి, తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ద్విచక్ర వాహానాలు సైతం వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మక్తల్‌కు రావడానికి ఇబ్బందులకు గురయ్యారు.