కందుకూరు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించనున్న జెండా పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొని ప్రధాన కూడళ్ల వద్ద, వార్డులలో అంగరంగా వైభవంగా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని చెప్పారు. ఈ జెండా పండుగ ద్వారా పార్టీ సత్తా చాటి ప్రతి పక్ష పార్టీల నాయకులు తోకముడుచుకొని పోయేలా చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్పా ఇతర పార్టీలకు చోటులేదని జెండా పండుగ ద్వార రుజువుచేయాలని పేర్కొన్నారు.