న్యూఢిల్లీ : న్యూఢిల్లీ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. జ్యూరిచ్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్ విఫలమై మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ విమానాన్ని నిలిపేయడంతో నలుగురు చిన్నారులు సహా 226 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆరుగురు ప్రయాణికులకు మాత్రం గాయాలయ్యాయి. అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులందరినీ కిందకు దించారు.
ప్రమాదం వల్ల ఎయిర్‌పోర్ట్‌లో ఇతర విమానాల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదని విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం (ఎల్ఎక్స్147) స్విస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ330 ఎయిర్‌బస్ అని తెలిసింది. ఎడమ ల్యాండింగ్ గేర్‌లో పొగ రావడం వల్ల ప్రమాదం జరిగిందన్న విషయాన్ని గుర్తించారు. ఇదే ఢిల్లీ విమానాశ్రయంలో పది రోజుల క్రితం స్పైస్ జెట్ విమానం ఆకాశ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఢీ కొట్టింది.