నెక్కొండ, మే 4 : వర్షానికి మక్కలు తడిసి తాము ఆగమవుతుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వరంగల్ జిల్లా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఉన్నతాధికారులు తరలివచ్చి మక్కల కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సై మహేందర్ తన సిబ్బందితో అక్కడికి వచ్చి రైతులను నిలువరించే ప్రయత్నం చేశారు.
‘నిన్న వానొచ్చిందని, మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని, అధికారులు వచ్చేదాక ఆందోళన విరిమించేది లేదు’ అని అన్నదాతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమస్యను పరిష్కరించే ఉన్నతాధికారులు ఎవరూ లేరని మండిపడ్డారు. రైతులు సొంతంగా వాహనాలను సమకూర్చుకొని సాయిరెడ్డిపల్లెలోని గోదాముకు మక్కలను తరలించాలని ఎస్సై సూచించారు. పనికర గుట్ట సమీపంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని మక్కలను రెండు రోజుల్లో తరలించే ఏర్పాట్లు చేస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.