బీబీపేట్, నవంబర్ 10: కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి సొంతంగా రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ‘శ్రీమంతుడు’ చిత్రబృందంతో కలిసి త్వరలో సందర్శిస్తానని ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబు బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంగళవారం ఈ పాఠశాలను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి.. ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తిని గుర్తుచేశారు.
బీబీపేట పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించగా.. కళాశాల ప్రారంభోత్సవానికి మహేశ్‌బాబును తీసుకువస్తానని కేటీఆర్ తెలిపారు. దాత సహకారంతో నిర్మించిన పాఠశాల ఫొటోలను కేటీఆర్ ట్విట్టర్లో పోస్టుచేశారు. ఈ ట్వీట్‌పై సినీ నటుడు మహేశ్‌బాబు స్పందించారు. త్వరలో తన ‘శ్రీమంతుడు’ చిత్ర బృందంతో కలిసి బీబీపేట్ పాఠశాలను సందర్శిస్తామని రీట్వీట్ చేశారు. ‘సుభాష్‌రెడ్డి లాంటి వాళ్లే నిజమైన హీరోలు. అలాంటివాళ్లు మరింతమంది ఈ సమాజానికి అవసరం’ అని మహేశ్ పేర్కొన్నారు.