ముంబై, సెప్టెంబర్ 7 : మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పార్టీ చీలికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆపరేషన్ టైగర్-4 జరగనున్నట్టు షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే మురళీ పటేల్ వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పటేల్ తెలిపారు. శివసేన(యూబీటీ)కు చెందిన 9 మంది లోక్సభ ఎంపీలలో ఆరుగురు ఇప్పటికే షిండే నాయకత్వంలోని శివసేనలో చేరిపోగా షిండే వర్గం బలం లోక్సభలో 7 నుంచి 13కు పెరిగింది.
అయితే 14 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఠాక్రే వర్గానికి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది కలసికట్టుగా ఫిరాయించిన పక్షంలో చట్ట ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేరే రకమైన న్యాయ, రాజకీయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ 14 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేను ఒక రహస్య ప్రదేశంలో కలుసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఠాక్రే వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.