Maharashtra : రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వెలసిన అక్రమ దాబాలు, హోటళ్లు, ఇతర ఫుడ్ స్టాళ్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా వెలిసిన దాబాలు, హోటళ్లు సహా అన్ని రకాల ఫుడ్ స్టాళ్లపై నిషేధం విధించింది. వీటిని తొలగించాలని ఆదేశించింది. ఇందుకు 60 రోజుల గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ఉండే దాబాలు, హోటళ్లకు పూర్తి అనుమతులు ఉండవు. స్థానిక నేతలు, అధికారుల సహకారంతో ఇవి నడుస్తుంటాయి.
అయితే, వీటివల్ల జాతీయ రహదారి భద్రతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయనే ప్రచారం ఉంది. అందుకే.. జాతీయ రహదారిపై రోడ్డు భద్రతా ప్రమాణాల పెంపు చర్యలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. మహారాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి రైట్ ఆఫ్ వే (ఆర్వోడబ్ల్యూ) ఆధారంగా అక్రమ దాబాలు, హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, ఇతర నిర్మాణాల్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా నడుస్తున్న వాటిని 60 రోజుల్లోగా కూల్చేందుకు జిల్లా మెజిస్ట్రేట్‌కు అధికారాలు కల్పించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్థానిక అధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, జాతీయ రహదారి వెంట నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. ముఖ్యంగా హైవేలపై సేఫ్టీ జోన్లలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. వాహనదారుల భధ్రతకు ప్రాధాన్యమివ్వాలి.
ట్రాఫిక్‌కు అడ్డు తగిలే నిర్మాణాలను వెంటనే తొలగించాలి. నేషనల్ హైవే పరిధిలో కొంత భూమిని రిజర్వుడ్ ల్యాండ్ కింద ఉంచుతారు. అలాంటి చోట నిర్మాణాలు చేపట్టి, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగితే కఠినంగా వ్యవహరించాలి. కొత్తగా హైవేలపై ఎలాంటి నిర్మాణాలకు, దాబాలు, హోటల్లకు అనుమతులు ఎవరూ ఇవ్వకూడదు. వాటికి అనుమతిచ్చే అధికారం స్థానిక సంస్తలు, పోలీసులు, అధికారులు సహా ఎవరికీ లేదు. ఎలాంటి లైసెన్సులు, ఎన్వోసీలు జారీ చేయకూడదు. గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామ పంచాయతీలు, జిల్లా కౌన్సిల్లు, ఇతర సంస్థలు ఈ నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాలి. ఇప్పటికే అనుమతి పొందిన దాబాల విషయంలో లైసెన్సుల పునరుద్ధరణ విషయంలోనూ సరైన తనిఖీలు నిర్వహించాలి.
30 రోజుల్లోగా తనిఖీలు నిర్వహించి అనుమతి ఇవ్వాలి. అది కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) నుంచి తగిన అనుమతి పొందిన తర్వాతే కొత్త దాబాలు, హోటళ్లకు అనుమతివ్వాలి. ఈ విషయంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.