Mumbai : మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై పోలీసుల కోసం ఇండ్లను భారీ స్థాయిలో నిర్మాణం, అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏకంగా ముంబై పోలీసుల కోసం 45,000 ఇండ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.20,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న పోలీసు కాలనీల అభివృద్ధితోపాటు, కొత్త ఇండ్ల నిర్మాణాన్ని భారీగా చేపడతారు. మొత్తం 45 వేల ప్రభుత్వ క్వార్టర్లను ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదం లభించింది. ఇందుకోసం ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయిస్తుంది. మిగతా 70 శాతం వివిధ సంస్థల నుంచి రుణం తీసుకుంటారు. దీనికి ప్రభుత్వం ష్యూరిటీ ఇస్తుంది. మహారాష్ట్ర స్టేట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఐడీసీ) ఈ ప్రాజెక్టు చేపడుతుంది. ఈ ప్రాజెక్టు సాంకేతికతను పరిశీలించడానికి రూ.100 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ముంబైలో పెరుగుతున్న జనాభా, ఇతర అవసరాల నేపథ్యంలో కొత్త తరహా, ఆధునిక ఇండ్ల నిర్మాణం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా పోలీసులకు క్వార్టర్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం ఐదు కోట్ల చదరపు అడుగుల స్థలంలో ఈ ప్రాజెక్టును చేపడతారు. ముంబైలో 51,308 మంది పోలీసులున్నారు. అయితే, వీరిలో 22,904 సర్వీస్ హౌజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 3,777 క్వార్టర్లు నివాసానికి పనికిరావని తేల్చారు.