యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్తులకు అభిషేకాలు, సాయంత్రం అదివాస కార్యక్రమాన్ని ప్రధానార్చక బృందం నిర్వహించింది. బాలాలయంలో పంచకుండాత్మక యాగాలు, మూలమంత్ర హవనాలు, విష్ణు సహస్రనామార్చనను పారాయణికులు, రుత్వికులు, ఉప ప్రధానార్చక బృందం చేపట్టింది. యాదాద్రి ప్రధాన ఆలయంలో అభిషేక పర్వాలు శాస్ర్తోక్తంగా సాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు శిలామూర్తులైన ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారులు, విష్వక్సేనుడు, గరుత్మంతుడి విగ్రహాలు, దివ్యవిమాన గోపురానికి పునఃప్రతిష్ఠించే సుదర్శన చక్రం, బలిపీఠాలకు 49 (ఏకో పంచాషట్) కలశాలతో అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గోమూత్రం, సుగంధ ద్రవ్యాలను కలిపి శుద్ధోదకాలను ఆయా కలశాల్లో నింపి వేదమంత్ర పఠనాలతో ఆయా మూర్తులను అభిషేకించారు. మంత్రాలతో ఆవాహన చేసిన 49 తత్తాలు విశేషమైన ఫలాలను అందిస్తాయని ప్రధాన అర్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
బాలాలయంలో కార్యక్రమాలు..
స్వామివారి బాలాలయంలో హోమాదులు, హవనాలు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవార్లకు నిత్యారాధన, అభిషేకాల అనంతరం శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి యాగశాలలో పంచకుండాత్మక మహాయాగాన్ని ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం చుతఃస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశికధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధాన అర్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠామూర్తులకు అధివాసం
స్వామివారి ప్రధాన ఆలయంలో సాయంత్రం 6 గంటలకు శిలామయ బింబమూర్తులు, సుదర్శన చక్రానికి మంత్రపూర్వకంగా అధివాస కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, చక్కెర, తేనెతో ప్రధాన ఆలయ ముఖ మండపంలో స్వామివారికి ప్రత్యేకమైన తొట్టిలో శిలామూర్తులను శయనింపజేసి అధివాసం చేపట్టారు.
యాగానికి 50 క్వింటాళ్ల సమిధలు
యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి బాలాలయంలో జరిగే పంచకుండాత్మక యాగానికి కావాల్సిన సమిధలను శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లోకల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు వడ్లోజు వెంకటేశ్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన 50 క్వింటాళ్ల మోదుగు, రావి, మర్రి, మామిడి, జువ్వి, అల్లనేరేడు, సండ్ర కలపను యాదాద్రిలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తికి అందజేశారు. వీటిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతి దంపతులు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సర్ణలతారెడ్డి పేరిట సమర్పించినట్టు తెలిపారు.
ఆర్జితసేవలు(భక్తులచే జరిపేవి) ఇలా..
సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం
(సర్వదర్శనం వేళల్లో) ;ఉదయం 6.30 నుంచి రాత్రి 9.15 గంటల వరకు
సుదర్శన నారసింహ హోమం ; ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు
స్వామివారి నిత్యకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం ; ఉదయం 10 30 నుంచి మధ్యాహ్నం 12.00
స్వామివారి వెండిమొక్కు జోడు సేవలు ;సాయంత్రం 5.00 నుంచి 6.30 గంటల వరకు
దర్బార్ సేవ ;సాయంత్రం 6.45 నుంచి 7.00 గంటల వరకు
ఆంజనేయస్వామికి ఆకుపూజ (ప్రతి మంగళవారం) ;ఉదయం 8.30 నుంచి 11.00 గంటల వరకు
ఆండాళ్ అమ్మవారి ఉత్సవసేవ (ప్రతి శుక్రవారం) ;సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 వరకు
