వాషింగ్టన్: స్మార్ట్ఫోన్ చేతిలో లేకుంటే చాలా మందికి దిక్కుతోచదు. నిత్య జీవితంలో అది భాగమైంది. అయితే రోదసిలోకి వేల కిలోమీటర్లు ప్రయాణించే వ్యోమగాములు మాత్రం వాటికి దూరంగా ఉండాల్సిందే. భద్రత కారణాల రీత్యా స్మార్ట్ ఫోన్లను ఇప్పటి వరకు రోదసిలోకి అనుమతించలేదు. ఇకపై అది మారబోతున్నది.
వ్యోమగాములు తమతోపాటే స్మార్ట్ఫోన్లను ఇకపై తీసుకెళ్లేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతించింది. చంద్రుడిపైకి అమెరికా చేపడుతున్న క్రూ-12, ఆర్టెమిస్ 2 మిషన్లతో ఇది ప్రారంభకానున్నది. ఈ మిషన్లలో వెళ్లే వ్యోమగాములు తమతోపాటు స్మార్ట్ఫోన్ను తీసుకెళ్లేందుకు అనుమతించినట్టు నాసా తెలిపింది. ఈ ఫోన్లతో వ్యోమగాములు తమకు నచ్చిన విధంగా ఫొటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసే అవకాశం వచ్చింది.