అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున భారీ విజయాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ ఒకటి. పదేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా నాగ్ కెరీర్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈ సినిమాకు సీక్వెల్గా ‘బంగార్రాజు’ విడుదలైంది. ఇందులో నాగార్జునతోపాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా భాగం కావడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే.. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా రానున్నది.
ఈ విషయాన్ని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తమ ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నది. ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే సంక్రాంతికి, జనవరి 15న సోగ్గాళ్లు వస్తే.. పండుగ ఇంకా కలర్ఫుల్గా ఉంటాది కదా.. డేట్ మార్క్ చేసుకోండి..’ అంటూ వచ్చే సంక్రాంతి బరిలో సందడి చేయబోతున్నట్టు ఈ పోస్ట్ ద్వారా ఖరారు చేశారు. ఇది నిజంగా అక్కినేని అభిమానులకు ఓ సర్ప్రైజ్. ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న కొత్త సినిమా ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి.