యాదాద్రి, ఫిబ్రవరి 22: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయానికి మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ పనులు వేగవం తమయ్యాయి. గర్భాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు పూర్తికావచ్చాయి. ప్రధానాలయం పూర్తికాగా, ఏసీ డక్ట్ పనులు చివరి దశకు చేరాయి. ఆలయంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురం, తూర్పు త్రితల రాజగోపురం, గర్భాలయ దివ్య విమాన గోపురాలకు కలశ స్థాపన చేయనున్నారు. మొత్తం 126 బంగారు కలశాలను స్థాపించనున్నట్టు, త్వరలో పనులు చేపట్టనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ధ్వజస్తంభాల బంగా రు తొడుగులు, ఇతర సామగ్రికి శుద్ధి పూజలు చేపట్టగా.. గర్భాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేపట్టి బంగారు తాపడం బిగించారు.
స్వర్ణతాపడానికి రూ.1,16,116 విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. భువనగిరికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రూ.1,16,116 విరాళం సమర్పించారు. కుటుంబసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్న ఆయన.. ఆలయ అధికారులకు నగదు అందజేశారు.