అంతర్జాతీయ క్రీడలు నిర్వహించుకునేలా పాలమూరు క్రీడామైదానాన్ని అభివృద్ధి చేస్తామని క్రీడాశాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.17కోట్లకుపైగా నిధులతో జిల్లా కేంద్రంలో క్రీడామైదానాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో 80వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని, 2శాతం క్రీడా కోటలో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. మూడు రోజులపాటు జరుగనున్న రాష్ర్ట స్థాయి టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు ఆదిలాబాద్ -రంగారెడ్డి జట్లు తలపడగా రంగారెడ్డి శుభారంగం చేసింది.
మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 14 : అంతర్జాతీయ క్రీడలు నిర్వహించుకునేలా మహబూబ్‌నగర్ జిల్లాలో క్రీడామైదానం అభివృద్ధి చేస్తామని పర్యాటక, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ మైదానంలో రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ టో ర్నీని మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో క్రీడామైదానాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
స్టేడియం మైదానంలో అన్ని వసతులతో ఇండోర్ స్టే డియం పనులు జరుగుతున్నాయన్నారు. ఎంవీఎస్ డి గ్రీ కళాశాల మైదానంలో మరో స్టేడియం ఏర్పాటు చేస్తున్నామని, రూ.10 కోట్లతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. త్వరలో రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అవుతాయని, అందు లో 2 శాతం క్రీడా కోటలో క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని, పిచ్చికుక్కలు అరిస్తే పట్టించుకునేదే లేదని తెలిపారు. అభివృద్ధికి సూచనలు చేయాలే తప్పా అడ్డుకోకూడదని సూచించారు. మినీట్యాంక్‌బండ్‌పై నెక్లెస్‌రోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడల నిర్వహణలో పీఈటీలు, క్రీడా సంఘాల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.
జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదని, రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి.. ఆదిలాబాద్, రంగారెడ్డి జట్ల మ్యాచ్‌ను మంత్రి ప్రారంభించారు. కొంత సేపు కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామరావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీవైఎస్వో శ్రీనివాస్, డీఈవో ఉషారాణి, నాయకులు కృష్ణమోహన్, రాజేశ్, అన్వర్, టీఎస్ పేట జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, వేణుగోపాల్, శ్రీనివాసులుగౌడ్, నిరంజన్‌రావు, వడెన్న, కురుమూర్తి, శ్రీరాములు, రాంచందర్, విలియమ్స్, సాధిక్‌అలీ, ఆనంద్, శ్రీనివాసులు, పరశురాం, రాజవర్ధన్, ఉమ, శారద, సుమత్ర తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా కబడ్డీ టోర్నీ..
మూడు రోజుల పాటు జరుగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు ఆదిలాబాద్‌పై 58-13 స్కోర్ తేడాతో గెలిచింది. వరంగల్-నిజామాబాద్ జట్ల మధ్య కూడా మ్యాచ్ జరిగింది.