మహబూబ్నగర్, మార్చి 14 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందే లా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ రెవెన్యూ సమావేశం నుంచి సోమవారం మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్లాట్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రిజిస్ట్రేషన్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అలాగే ధరణిలో నమోదైన భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దళితబంధు పథకానికి సం బంధించి మండలాలవారీగా లబ్ధిదారుల వివరాలతో పీపీటీ తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. దళితబంధుపై 18నుంచి 20వ తేదీవరకు శిక్షణాతరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అంచనాలను సమర్పించాలని సూచించారు.
సమస్యలు పరిష్కరించాలి
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమార్గం చూపాలన్నారు. ప్రజావాణికి ఫిర్యాదులు పునావృత్తం కాకుండా చూడాల్సిన బా ధ్యత అధికారులదేనని తెలిపారు. ప్రజావాణికి 66 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య తదితరులు పాల్గొన్నారు.